భారతదేశానికి వ్యతిరేకంగా దుందుడుకుగా ముందుకు వెళ్లిన చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్.. అనూహ్య వైఫల్యం చెందారని అమెరికాలో ప్రముఖ మ్యాగజీన్ 'న్యూస్ వీక్' పేర్కొంది. భారత భూభాగంలోకి సైన్యాన్ని పంపించడం వెనుక వ్యూహ రచన అంతా ఆయనదేనని తెలిపింది. అయినా ఆ యత్నాన్ని భారత సైన్యం గట్టిగా తిప్పి కొట్టడంతో జిన్‌పింగ్ భంగపాటుకు గురయ్యారని విశ్లేషించింది. భారత సైన్యం దక్షతను కొనియాడింది. చైనా అధ్యక్షుడు తన భవితవ్యాన్ని ప్రమాదంలో నెట్టేసుకున్నారని విమర్శించింది.
"ఇప్పటికే జిన్‌పింగ్ చైనాలో తన ప్రత్యర్థులపై అణచివేత విధానాలకు పాల్పడుతున్నారు. దానిపై స్వదేశంలో ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్న ఆయన తాజా వైఫల్యంతో భారత సైనిక దళాలపై ఇంకో రకంగా దూకుడు చర్యకు పాల్పడవచ్చు. చైనా వైఫల్యానికి పరిణామాలు ఇంకా ఉంటాయి." అని హెచ్చరించింది.