worldwide coronavirus cases: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రోజుకు 20 లక్షలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. శనివారం ఒక్కరోజే 23,53,411 మందికి వైరస్ అంటుకోగా.. 5,605 మంది మృతి చెందారు. ఇందులో దాదాపు 40 శాతం కేసులు ఒక్క అమెరికాలోనే నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
అమెరికాలో ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా విస్తరిస్తూ రోజుకు లక్షల మందికి అంటుకుంటోంది. శనివారం ఒక్కరోజే 4,02,735 కొత్త కేసులు వెలుగు చూశాయి. 882 మంది వైరస్‌కు బలయ్యారు. దీంతో మొత్తం కేసులు 66,662,877, మరణాలు 8,73,145కు చేరాయి. ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుండటం, వైరస్ కారణంగా సిబ్బంది కొరతతో ఆరోగ్య వసతులపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఆర్మీ వైద్యులను మోహరిస్తోంది బైడెన్ ప్రభుత్వం.
ఫ్రాన్స్‌లో అదే ఉద్ధృతి..
ఫ్రాన్స్‌లో కరోనా ఉద్ధృతి తగ్గటం లేదు. డెల్టాతో పాటు ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తోంది. అలాగే కొత్త వేరియంట్‌ను గుర్తించటం కలకలం సృష్టిస్తోంది. శనివారం మరో 3,24,580 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయి. 148 మంది మృతి చెందారు. 27వేల మంది కోలుకున్నారు. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 13,894,255, మరణాలు 1,26,869కి చేరాయి.
ప్రపంచవ్యాప్తంగా వైరస్ ఉద్ధృతి ఎక్కువగా ఉన్న దేశాల్లో..
- ఇటలీలో వైరస్ విజృంభిస్తోంది. శనివారం ఒక్కరోజే 1,80,426 మందికి వైరస్ సోకింది. 239 మంది మరణించారు. 1,25,199 మంది కోలుకున్నారు. మొత్తం కేసుల సంఖ్య 120,609కు చేరింది.
- ఆస్ట్రేలియాలో కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. శనివారం ఒక్కరోజే 1,03,836 మందికి వైరస్ సోకగా.. 55 మంది మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,640, 386కు చేరింది.
- అర్జెంటీనాలో కొవిడ్ వైరస్ వేగంగా విస్తరిస్తోంది. కొత్తగా 96,652 మందికి వైరస్ సోకింది. 88 మంది వైరస్‌కు బలయ్యారు. మొత్తం కేసులు 7,029,624కు చేరాయి.
- బ్రిటన్‌లో కొత్తగా 81,713 మందికి వైరస్ నిర్ధరణ అయింది. 287 మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 1.5 కోట్లు దాటింది.
- టర్కీలో 63వేలు, జర్మనీలో 60 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. మరోవైపు.. బ్రెజిల్, రష్యా, కొలంబియా, మెక్సికో, ఫిలిప్పీన్స్, బెల్జియం వంటి దేశాల్లో వైరస్ ఉద్ధృతి అధికంగా ఉంది. రోజుకు దాదాపు 30వేలకుపైగా కొత్తగా వైరస్ బారినపడుతున్నారు.
ఇదీ చూడండి:స్కూళ్లలోకి ఆ పిల్లలకు నో ఎంట్రీ- ప్రభుత్వం హెచ్చరిక!