ప్రపంచంపై కరోనా ఉగ్రరూపం అంతకంతకూ పెరిగిపోతోంది. కేసుల సంఖ్యలో రోజూ సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. ఒక్కరోజులోనే 2 లక్షలకుపైగా కేసులు వస్తుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అయితే.. వైరస్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరగటం.. కాస్త ఊరట కలిగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఒక్కరోజు వ్యవధిలో 2,58,896 కేసులు నమోదయ్యాయి. కొత్తగా 5,717 మంది మహమ్మారికి బలయ్యారు.
అమెరికాలో 43 లక్షలకు పైనే..
అగ్రరాజ్యంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. రోజుకు 60-70 వేల వరకు కొత్త కేసులు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 43 లక్షలు దాటింది. సుమారు 1.50 లక్షల మంది వైరస్ ధాటికి బలయ్యారు. మరో 20 లక్షల 60 వేల మందికిపైగా బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారు.
బ్రెజిల్లో రికార్డు స్థాయిలో..
కేసులు, మరణాల్లో రెండోస్థానంలో కొనసాగుతోన్న బ్రెజిల్లో వైరస్ వ్యాప్తి ఏ మాత్రం తగ్గడంలేదు. రోజువారీ కేసుల్లో కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 24 లక్షలకు చేరువైంది. సుమారు మరో 86.5 వేల మంది వైరస్ బారినపడి మరణించారు.