అగ్రరాజ్యం అమెరికాలో ఓట్ల లెక్కింపు జరుగుతున్న వేళ..యావత్ ప్రపంచం ఉత్కంఠతో ఎదురుచూస్తోంది. ముఖ్యంగా ట్రంప్ మరోసారి అధికారంలోకి రావాలని కొందరు కోరుకుంటుండగా మరికొన్ని దేశాలు మాత్రం అధ్యక్షుడి మార్పును కోరుకుంటున్నాయి. అమెరికా ఎన్నికల తీరుపై సుప్రీంకోర్టుకు వెళ్తానని ట్రంప్ ప్రకటించడంతో, బైడెన్ కూడా న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. ఒకవేళ కోర్టుకు వెళితే ఫలితం మరింత ఆలస్యం అయ్యే అవకాశాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. రిపబ్లికన్ ట్రంప్, డెమొక్రాట్ బైడెన్‌ల మధ్య హోరాహోరీ పోరు నడుస్తున్న వేళ ప్రపంచ దేశాలు ఏవిధంగా స్పందిస్తున్నాయో చూద్దాం..
చైనా మీడియా ఆసక్తి..
అమెరికా ఓట్ల లెక్కింపు జరుగుతున్న సమయంలో చైనా వేచిచూసే ధోరణిలో ఉంది. అయితే, అక్కడి అధికారిక మీడియా మాత్రం అమెరికా తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నట్లు పేర్కొంది. అంతేకాకుండా అమెరికా ఎన్నికల తీరును చైనా అపహాస్యం చేసినట్లు అమెరికా మీడియా పేర్కొంది. అధ్యక్షుడి మార్పును చైనా కోరుకుంటున్నట్లు ఇప్పటికే చైనా పత్రికలు వెల్లడించాయి. ఫలితాల వేళ మరోసారి స్పందించిన చైనా మీడియా.. ప్రస్తుత ఎన్నికలు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మాదిరిగా కనిపిస్తున్నాయని ప్రకటించింది. అమెరికా పాలనా సామర్థ్యంలో సమస్యలు ఉన్నాయని.. వీటికి లోతైన సంస్కరణలు అవసరమని గ్లోబల్ టైమ్స్ తన ఎడిటోరియల్‌లో అభిప్రాయపడింది. అమెరికాలో ఉన్న చైనీస్ అమెరికన్లలో 56శాతం మంది బైడెన్‌కే జై కొడుతున్నట్లు వెల్లడించింది. కేవలం 20శాతం మంది మాత్రమే ట్రంప్‌నకు మద్దతు తెలుపుతున్నారని పేర్కొంది. ఈసారి అమెరికా 'వితౌట్ హోప్' అంటూ షిన్‌హువా న్యూస్ ఏజెన్సీ వ్యాఖ్యానించింది. ఒకవేళ బైడెన్ అధికారంలోకి వస్తే ఇరు దేశాల మధ్య సంప్రదింపులు, చర్చలకు ఆస్కారం ఉంటుందని చైనా కేబినెట్ మాజీ సలహాదారుడు డింగ్ యిఫాన్ ఆశాభావం వ్యక్తంచేశారు.
యూరప్ తటస్థం..
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రభావం యూరప్-అమెరికా వాణిజ్య సంబంధాలపై స్వల్ప ప్రభావమే చూపిస్తుందని ఫ్రాన్స్ మరోసారి స్పష్టంచేసింది. గడిచిన చాలా ఏళ్లుగా యురోపియన్ యూనియన్‌తో అమెరికా స్నేహపూర్వక భాగస్వామిగా లేదని ఫ్రాన్స్ ఆర్థికశాఖ చీఫ్ బ్రూనో లీ మైరే వెల్లడించారు. ట్రంప్ లేదా బైడెన్ ఎవరు గెలిచినా ప్రస్తుత వైఖరిలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చని అభిప్రాయడ్డారు. చైనా, ఆసియాతోనే అమెరికా ఎక్కువ సంబంధాలు కలిగి ఉందని ఆయన పేర్కొన్నారు.
'అమెరికా రాజకీయ వ్యవస్థలో ద్వేషం ప్రవేశించింది. ఇకపై కేంద్రీకృత రాజకీయాలు ఉండవని..భిన్న వైఖరుల్లో అమెరికా రాజకీయలు ఉండనున్నాయి' అని జర్మన్ విదేశీ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నార్బర్ట్ రోట్జెన్ ట్విటర్‌లో వెల్లడించారు. లండన్ మేయర్ సాదిక్ ఖాన్ కూడా బైడెన్‌కే మద్దతు తెలిపారు. ఇక అమెరికా ప్రజాస్వామ్యం గందరగోళంలో పడిందని, ఎన్నికల తర్వాత నిరసనలు పెల్లుబికే అవకాశం ఉన్నట్లు రష్యా అనుకూల మీడియా పేర్కొంది.
ట్రంప్‌కు వ్యతిరేకంగా ఇరాన్..
ఇక ఇరాన్ కూడా ట్రంప్‌కు వ్యతిరేకంగానే ఉంది. సొంత ఎన్నికల్లోనే అవకతవకలు జరిగాయంటూ ట్రంప్ వ్యాఖ్యానించడాన్ని ఇరాన్ అగ్రనాయకత్వం తప్పుబట్టింది.
ట్రంప్‌కు జైకొట్టిన బ్రెజిల్.. ఆసక్తిగా తిలకిస్తోన్న కెనడా..