పాఠశాలల మూసివేత, నగరాల నిర్బంధం, కుప్పుకూలుతున్న స్టాక్ మార్కెట్లు, క్రీడా టోర్నీల రద్దు, పర్యటనలపై నిషేధం, ఆసుపత్రుల్లో గంటగంటకు పెరుగుతున్న రోగుల సంఖ్య... ఇవి ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్ వల్ల నెలకొన్న పరిస్థితులు. ఒక్క మాటలో చెప్పాలంటే.. వైరస్‌తో ప్రపంచం స్తంభించిపోయింది. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఈ మహమ్మారిని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్).. 'అంతర్జాతీయ మహమ్మారి'గా పేర్కొంది. అయితే ఇది కేవలం ఆరంభమేనా?
మరింత దారుణ పరిస్థితులు!
చైనాలో మూడు నెలల క్రితం పుట్టిన కరోనా వైరస్.. సరిహద్దులను చెరుపుకుని దాదాపు అన్ని ఖండాలను తాకింది. ఉన్నతస్థాయి అధికారుల నుంచి.. హాలీవుడ్ దిగ్గజ నటుల వరకు.. అందరికీ వైరస్ సోకడం ప్రపంచ దేశాలను కుదిపేస్తోంది.
అగ్రరాజ్యం అమెరికాలో వైరస్ ప్రభావం ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. ఇన్ని రోజులు కరోనాను తేలికగా తీసుకున్న ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఒక్కసారిగా కీలక నిర్ణయం తీసుకున్నారు. అగ్రరాజ్యంలో పెరుగుతున్న కేసుల దృష్ట్యా.. ఐరోపాకు రాకపోకలను నిలిపివేశారు. ట్రంప్ ప్రకటనతో ముడిచమురు ధర మరింత క్షీణించింది. స్టాక్ మార్కెట్ల పతనం కొనసాగింది.
పరిస్థితులు మరింత దారుణంగా మారే అవకాశాలున్నాయని శాస్త్రవేత్తలు, పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.