అఫ్గాన్‌లో అన్ని వర్గాలకు ప్రాధాన్యం కల్పించేలా, మహిళలకు పెద్ద పీట వేసేలా, ఐక్యతారాగం పల్లవించేలా ఓ సరికొత్త ప్రభుతాన్ని ఏర్పాటు చేయాలని ఐక్యరాజ్య సమితి భద్రత మండలి పిలుపునిచ్చింది. అఫ్గాన్ గడ్డపై హింసను విడనాడాలని, ఉగ్రవాద కార్యకలాపాలకు స్థానం కల్పించరాదని పునరుద్ఘాటించింది. అఫ్గాన్ తాలిబన్ల వశమయ్యాక అక్కడ నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై భారత్ అధ్యక్షతన 15 దేశాలు సభ్యులుగా ఉన్న భద్రతా మండలి సోమవారం అత్యవసర సమావేశం నిర్వహించింది.
అఫ్గాన్ అంశంపై 10 రోజుల వ్యవధిలో భద్రతా మండలి నిర్వహించిన రెండో సమావేశమిది. ఇందులో ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ మాట్లాడుతూ అఫ్గాన్ మళ్లీ ఉగ్రవాద సంస్థల స్వర్గధామంగా మారకుండా ఉండేందుకు అంతర్జాతీయ సమాజం కృషి చేయాలని పిలుపునిచ్చారు. యుద్ధంతో చితికిపోయిన దేశంలోని ప్రజలను ఒంటరిగా విడిచిపెట్టకూడదని ఉద్ఘాటించారు. విపత్కర పరిస్థితుల్లో తాలిబన్లు సహా అన్ని వర్గాలు ప్రజల ప్రాణాలు కాపాడడానికి అత్యంత సంయమనం పాటించాలని గుటెరస్ ఆకాంక్షించారు. ఎవరి చేతిలో అధికారం ఉన్నా అఫ్గాన్‌లో ప్రాథమిక హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉండాలని పేర్కొన్నారు. రాబోయే రోజులు కీలకమని పేర్కొన్న గుటెరస్, అఫ్గాన్ శరణార్థులను స్వీకరించడానికి అన్ని దేశాలు సిద్ధంగా ఉండాలన్నారు.
ఉగ్రవాద స్థావరం కావొద్దు: అమెరికా
అఫ్గానిస్థాన్ మళ్లీ ఉగ్రవాద స్థావరంగా మారకూడదని అమెరికా ఆకాంక్షించింది. అందుకు అంతర్జాతీయ సమాజం కృషి చేయాలని పిలుపునిచ్చింది. అఫ్గాన్ శరణార్థులకు దాని సరిహద్దు దేశాలతో పాటు ఇతర దేశాలు చోటివ్వాలని కోరింది. అక్కడి పౌరులను, పాత్రికేయులను కాపాడాలని పేర్కొంది. మహిళలు, చిన్నారులు, మైనార్టీలు సహా అందరి హక్కులను పరిరక్షించాలని చెప్పింది.
తాలిబన్లతో చర్చిస్తాం: రష్యా
అఫ్గాన్‌లో పరిస్థితులు ఎలా ఉన్నా తాలిబన్లతో చర్చలు జరుపుతామని భద్రతా మండలికి రష్యా తెలిపింది. పౌరులకు, ఇతర దేశాల దౌత్య సిబ్బందికి భద్రత కల్పిస్తామని, శాంతిని నెలకొల్పుతామని తాలిబన్లు ఇప్పటికే హామీ ఇచ్చినట్లు తెలిపింది. అయితే అక్కడ కొన్ని ఉగ్రవాద సంస్థల ఉనికిపై రష్యా ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు దోహాలో జరిపిన చర్చల్లో శాంతికి కట్టుబడి ఉంటామని తాలిబన్లు ప్రకటించారని, కానీ వారి చర్యలు అందుకు భిన్నంగా ఉన్నాయని బ్రిటన్ పేర్కొంది.
అలాంటి ప్రభుత్వాన్ని గుర్తించొద్దు: అఫ్గాన్
దౌర్జన్యంగా అధికారంలోకి వచ్చే ప్రభుత్వాలను భద్రతా మండలి, ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ గుర్తించకూడదంటూ అఫ్గాన్ కోరింది. నిందారోపణలకు ఇది సమయం కాదని పేర్కొంది. అఫ్గాన్‌లో లక్షల మంది ప్రజల భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొందని తెలిపింది. బాలికలు, యువతులు విద్యాసంస్థలకు వెళ్లే స్వాతంత్య్రాన్ని కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తంచేసింది. అఫ్గాన్‌లో పరిస్థితి మరింత దిగజారకుండా ఉండడానికి భద్రతా మండలి చర్యలు చేపట్టాలని అర్థించింది.