అమెరికా క్యాపిటల్ భవనం వద్ద ఆందోళనలను పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి. బైడెన్ ఎన్నికను ఆ దేశ కాంగ్రెస్ అధికారికంగా ధ్రువీకరించే తరుణంలో.. ట్రంప్ మద్దతుదారులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది.
యూఎస్ కాంగ్రెస్‌కు సంబంధించిన చిత్రాలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్. ప్రజాస్వామ్యం కోసం శాంతియుత అధికార బదిలీ నేపథ్యంలో ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమన్నారు. ఐరోపా మిత్ర దేశాలూ ఈ దాడిని తప్పపట్టాయి. ట్రంప్ తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి.
ఎవరేమన్నారంటే.?
- ట్రంప్, ఆయన మద్దతుదారులు.. అమెరికన్ ఓటర్ల నిర్ణయాన్ని అంగీకరించకపోవటం సహా.. ప్రజాస్వామ్యాన్ని నిందించడం మానేయాలని జర్మన్ విదేశాంగ మంత్రి హకో మాస్ పేర్కొన్నారు.
- ప్రపంచంలోనే అతిపెద్ద శాసనసభల్లో ఒక దానికి అధ్యక్షత వహిస్తోన్న ఐరోపా ఎంపీ డేవిడ్ ససోలీ.. క్యాపిటల్ భవనం వద్ద జరిగిన ఆందోళనలను ఖండించారు. ఐరోపా అధికార యంత్రాంగం, ట్రంప్ పాలనతో నాలుగేళ్లు సత్సంబంధాలు కలిగి ఉందని.. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడన్తోనూ సత్సంబంధాలను కొనసాగించేందుకు ఎదురుచూస్తున్నట్టు చెప్పారు ససోలి.
- ట్రంప్ మద్దతుదారుల్ని ఓ తిరుగుబాటు చర్యగా అభివర్ణిస్తూ ట్వీట్ చేశారు స్వీడన్ మాజీ ప్రధాని కార్ల్ బిల్ట్.
- బైడెన్ ధ్రువీకరణను అడ్డుకునే ఇలాంటి హింసాత్మక ఘటనపై ఆందోళన వ్యక్తం చేసింది నాటో మిత్ర దేశం టర్కీ. ఈ గందరగోళంతో చట్టసభ సభ్యులనే భవనం నుంచి బయటకు పంపాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసింది. యూఎస్‌లోని అన్ని పార్టీలు.. నియంత్రణతో ఉండాలని టర్కీ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో నెలకొన్న ఈ రాజకీయ సంక్షోభంపై అమెరికా త్వరలోనే అధిగమిస్తుందని తాము ఆశిస్తున్నట్టు పేర్కొంది.
ఇదీ చదవండి:'ఎన్నికల్లో ఓటమిని అంగీకరించేది లేదు'