అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారుల ఆందోళనతో వాషింగ్టన్ అట్టుడికింది. అగ్రరాజ్య చరిత్రలో మాయని మచ్చ వంటి ఘటనకు క్యాపిటల్ భవనం వేదికైంది. వందలాది మంది ఆందోళనకారులు భవనంలోకి చొరబడి విధ్వంసం సృష్టించారు. ఈ ఘటనపై ప్రపంచదేశాలు తీవ్రంగా ఖండించాయి. నిరసనకారుల తీరును తప్పుబట్టాయి.
వాషింగ్టన్లో నెలకొన్న పరిస్థితులపై ఐక్యరాజ్యసమితి తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. ఇలాంటి సమయంలో నాయకులు పరిణతితో మద్దతుదారులను సముదాయించాలని సూచించింది. చట్టాలను, ప్రజాస్వామ్య విధానాన్ని గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొంది. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల్లో ఒకటైన అమెరికాలో ఈ తరహా ఘటనలు ఆందోళన కలిగించే విషయమని ఐరాస జనరల్ అసెంబ్లీ 75వ సమావేశాలకు అధ్యక్షుడిగా ఉన్న వోల్కన్ బోజ్కిర్ ఆవేదన వ్యక్తం చేశారు.
అణచివేయలేం: భారత్
అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో అల్లర్లు, హింసాత్మక ఘటనలు జరగడం బాధాకరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. క్రమబద్ధంగా, శాంతియుతంగా అధికార బదిలీ జరగాలని ఆకాంక్షించారు. చట్ట విరుద్ధమైన నిరసనల ద్వారా ప్రజాస్వామ్య ప్రక్రియను అణచివేయలేమని పేర్కొన్నారు.
'ట్రంప్ మాటలే అగ్గిరాజేశాయి'
క్యాపిటల్ హిల్‌పై జరిగిన భయంకరమైన దాడిని బ్రిటన్ ఖండించింది. అమెరికా కాంగ్రెస్‌లో జరిగిన ఘటన అవమానకరమైనది ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం పక్షాన నిలబడే అమెరికాలో శాంతియుతమైన అధికార బదిలీ జరగాలని ఆకాంక్షించారు.
హింసకు అధ్యక్షుడే కారణమని బ్రిటన్ హోంమంత్రి ప్రీతీ పటేల్ ఆరోపించారు. ట్రంప్ వ్యాఖ్యలే ఆందోళనకు అగ్గిరాజేశాయని అన్నారు. నిరసనలను అదుపులోకి తెచ్చేందుకు ట్రంప్ ఏమీ చేయలేదని వ్యాఖ్యానించారు. ఇప్పటికీ హింసను ఖండించలేదని పేర్కొన్నారు.
ప్రజాస్వామ్యానికి ఎదురుదెబ్బ: హాంకాంగ్
అమెరికాలో జరిగిన హింస ప్రజాస్వామ్యానికి ఎదురుదెబ్బ వంటిదని హాంకాంగ్ వాసులు అభివర్ణించారు. అమెరికా గౌరవానికి ఈ ఘటన వల్ల భంగం కలిగిందని ప్రజాస్వామ్య అనుకూల కార్యకర్తలు పేర్కొన్నారు. హాంకాంగ్‌లోని బీజింగ్ అనుకూల వర్గాలు సైతం ఘటనను ఖండించాయి. ఈ ఘటనను తిరుగుబాటుగా పేర్కొన్నాయి. ప్రభుత్వం పట్ల గౌరవం, శాంతి భద్రతలకు భంగం కలిగాయని ఆరోపించాయి.
ఆమోదించేది లేదు: ఫ్రాన్స్
ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నించేవారి నిరసనలను ఆమోదించే ప్రసక్తే ఉండదని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ పేర్కొన్నారు. అమెరికా హింసను ఉద్దేశించి వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ప్రజాస్వామ్యంపై తమకు విశ్వాసం ఉందని, వాషింగ్టన్లో జరిగిన ఘటన.. అమెరికాను సూచించేది కాదని అన్నారు.
ప్రజాస్వామ్యంపై దాడి: కెనడా
అమెరికా క్యాపిటల్ వద్ద కనిపించే దృశ్యాలు ప్రజాస్వామ్యంపై దాడి వంటివని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో పేర్కొన్నారు. అగ్రరాజ్యంలో ఉద్రిక్తతల పట్ల కెనడా ప్రజలు మనస్తాపానికి గురయ్యారని అన్నారు. హింస ద్వారా ప్రజల అభీష్టాన్ని మార్చలేరని వ్యాఖ్యానించారు.