తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనా పోరాట నిధికి ప్రపంచ నాయకుల పిలుపు

కరోనాను ఎదుర్కొనేందుకు జీ-20 దేశాలు కృషి చేయాలని ప్రపంచ దేశాల నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు. మాజీ అధ్యక్షులు, ప్రధానులతో పాటు పలురంగాల నిపుణులతో కూడిన 165 మంది సభ్యుల బృందం జీ-20 దేశాల అధినేతలకు లేఖ రాసింది. కరోనా పోరాట నిధిని సమన్వయం చేసేందుకు కార్యదళాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది.

COVID-19 fighting fund
కరోనా పోరాట నిధికి ప్రపంచ నాయకుల పిలుపు

By

Published : Apr 8, 2020, 10:40 PM IST

ప్రపంచంలోని 165 మందితో కూడిన అగ్ర నాయకుల బృందం కరోనా వైరస్ పోరాట నిధిని సమన్వయం చేసేందుకు జీ-20 దేశాలు టాస్క్ ఫోర్స్​ను ఏర్పాటు చేయాలని కోరారు. వీరిలో 92 మంది మాజీ అధ్యక్షులు, ప్రధానమంత్రులతో పాటు ఆర్థిక, ఆరోగ్య నిపుణులు ఉన్నారు.

ఈ మేరకు జీ-20 దేశాల అధినేతలకు ఈ బృందం లేఖ రాసింది. వీరిలో భారత్ నుంచి ఆర్థిక వేత్తలు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా, కౌశిక్ బసు ఉన్నారు. కరోనా పోరాటంలో భాగంగా అత్యవసరంగా సమావేశమై.. అంతర్జాతీయ నిధిని సమన్వయం చేసే టాస్క్​ఫోర్స్​పై చర్చించాలని కోరారు.

"ఆరోగ్య అత్యయిక స్థితికి పరిష్కారం దొరికే వరకూ ఆర్థిక పరిస్థితి మెరుగపడదు. ఏదో ఒక దేశంలో వ్యాధి తీవ్రత తగ్గితే ఈ సమస్యకు పరిష్కారం దొరికినట్లు కాదు. అన్ని దేశాల్లో వ్యాధి వ్యాప్తి అదుపులోకి రావాలి. అందుకోసం అత్యవసర నిధిని సమకూర్చాల్సిన అవసరం ఉంది."

- ప్రపంచ నేతలు

అంశాల వారీగా వివిధ రకాలుగా ప్రపంచానికి సాయం చేయాల్సిన అవసరం ఉందని ఈ నాయకుల బృందం వివరించింది.

  • వ్యాక్సిన్, చికిత్స, ఔషధాల కోసం 8 బిలియన్ డాలర్లు
  • వైద్య వ్యవస్థ (వెంటిలేర్లు, పీపీఈలు) కోసం 35 బిలియన్ డాలర్లు
  • అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వైద్య, ఆర్థిక సంక్షోభాన్ని నివారించేందుకు 150 బిలియన్ డాలర్లు
  • పేద దేశాలకు రుణ వడ్డీల చెల్లింపుల కోసం 44 బిలియన్ డాలర్లు
  • ఆర్థిక మాంద్యం పరిస్థితులు మరింత తీవ్రం కాకుండా ఉద్దీపన చర్యలు

ద్రవ్య సంక్షోభం.. దివాలా పరిస్థితికి మారకుండా ఈ చర్యలు అవసరమని తెలిపారు నేతలు. మాంద్యం తలెత్తితే అంతర్జాతీయంగా కుంగుబాటు తప్పదని హెచ్చరించారు. వీటిని ఎదుర్కొనేందుకు ఆర్థిక, ద్రవ్య, కేంద్ర బ్యాంకులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని సూచించారు. ఇందుకోసం ఐరాస, జీ-20 దేశాలతోపాటు ఇతర ముఖ్యమైన భాగస్వాములు ముందుకు రావాలని కోరారు.

జీ-20 దేశాల సమావేశం..

కరోనా నేపథ్యంలో మార్చి 26న జీ-20 దేశాల అధినేతలు వీడియో కాన్ఫరెన్స్​లో చర్చించారు. పలు ఉద్దీపన చర్యలతో పాటు 5 ట్రిలియన్ డాలర్ల సాయానికి అంగీకారం తెలిపారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) కూడా భారీ ప్యాకేజీని ప్రకటించాలని జీ- 20 దేశాలు డిమాండ్ చేశాయి.

ఇదీ చూడండి:ప్రపంచవ్యాప్తంగా 83వేలు దాటిన కరోనా మరణాలు

ABOUT THE AUTHOR

...view details