హైడ్రాక్సీక్లోరోక్విన్ ట్రయల్స్‌ను పునరుద్ధరిస్తున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ప్రకటించింది. భద్రతాపరమైన డేటాను సమీక్షించిన అనంతరం.. ప్రణాళిక ప్రకారం ట్రయల్స్ కొనసాగించవచ్చని నిపుణులు తెలిపినట్టు డబ్ల్యూహెచ్ఓ స్పష్టం చేసింది.
" హైడ్రాక్సీక్లోరోక్విన్ ఔషధం మీద అందుబాటులో ఉన్న మొత్తం డేటాను డబ్ల్యూహెచ్ఓ భద్రతా పర్యవేక్షణ కమిటీ పరీక్షించింది. ట్రయల్స్‌లో మార్పులు చేయాల్సిన అవసరం లేదని కమిటీ స్పష్టం చేసింది. ప్రణాళిక ప్రకారం ట్రయల్స్ కొనసాగించవచ్చని పేర్కొంది."
--- టెడ్రోస్ అథనోమ్, డబ్ల్యూహెచ్ఓ డైరక్టర్.
ఫలితంగా.. ఇకపై అధ్యయనాల కోసం వైద్యులు రోగులకు ఈ మందును అందించనున్నారు.
హైడ్రాక్సీక్లోరోక్విన్‌తో వైరస్ నయమవుతుందని అనేక వార్తలు వచ్చాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దీనిపై విస్తృతంగా ప్రచారం చేశారు. వైరస్‌పై పోరులో ఈ డ్రగ్ ఓ గేమ్‌ఛేంజర్‌గా మారనుందని అనేక మార్లు పేర్కొన్నారు. అయితే హైడ్రాక్సీక్లోరోక్విన్ వాడటం వల్ల.. కరోనా రోగికి వ్యాధి నయంకాక పోగా.. గుండెజబ్బు వంటి ఇతర సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉందని పలు అధ్యయనాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో గత నెలలో.. హైడ్రాక్సీక్లోరోక్విన్ ట్రయల్స్‌ను.. కరోనా చికిత్స కోసం జరుగుతున్న అధ్యయనాల నుంచి తాత్కాలికంగా తొలగించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ.