తెలంగాణ

telangana

ETV Bharat / international

మళ్లీ కొవిడ్​ విజృంభణ- అమెరికాలో రోజుకు లక్ష!

ప్రపంచ దేశాల్లో కరోనా కేసులు మళ్లీ ఆందోళనకరంగా నమోదవుతున్నాయి. అమెరికాలో గడిచిన రెండు రోజులుగా నిత్యం లక్షపైగా కేసులు బయటపడుతున్నాయి. చైనాలో డెల్టా కేసుల నియంత్రణకు కఠిన చర్యలు అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అటు బ్రెజిల్​, రష్యా, బ్రిటన్​, ఇరాన్​ సహా పలు దేశాల్లో కరోనా బాధితులు విపరీతంగా పెరుగుతున్నారు. ఇండోనేసియాలో కొవిడ్​ మరణమృదంగం కొనసాగిస్తోంది.

World Coronavirus cases
ప్రపంచంలో కొవిడ్ కేసులు

By

Published : Aug 6, 2021, 11:34 AM IST

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్​ కేసులు మళ్లీ భారీ సంఖ్యలో బయటపడుతున్నాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 20 కోట్ల 17 లక్షలు దాటగా.. 42 లక్షల 80 వేలమందికిపైగా కొవిడ్​ బలయ్యారు. 18 కోట్ల మందికిపైగా వైరస్​ నుంచి కోలుకున్నారు. ఓ వైపు వ్యాక్సినేషన్ కొనసాగుతున్న.. మరోవైపు కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది.

అమెరికాలో గడిచిన రెండు రోజులుగా నిత్యం లక్షకుపైగా కేసులు నమోదవుతున్నాయి. గురువారం 1.20 లక్షల మందికిపైగా కొవిడ్​ బారిన పడ్డట్లు తేలింది. మరో 559 మంది ప్రాణాలు కోల్పోయారు. 27 వేల మంది కొత్తగా కరోనా జయించారు.

డెల్టా వేరియంట్ పంజా

చైనాలో డెల్టా వేరియంట్​ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా.. 80 మంది కొవిడ్ బారిన పడ్డారు. వీటిలో 58 కేసులు ఒక్క వుహాన్​ నగరంలోనే నమోదవడం గమనార్హం. దీంతో వైరస్​ వ్యాప్తిని నియంత్రించేందుకు చర్యలు ముమ్మరం చేసింది అక్కడి పాలనా యంత్రాంగం. లాక్​డౌన్​, ప్రయాణాలపై ఆంక్షలు విధించడం సహా భారీ సంఖ్యలో కొవిడ్​ పరీక్షలు నిర్వహిస్తోంది. ​

బ్రెజిల్​లో రోజువారీ కరోనా కేసులతో పాటు.. మరణాలు భారీగా నమోదవుతున్నాయి. తాజాగా 40 వేల మందికిపైగా కొవిడ్​ పాజిటివ్​గా తేలగా.. 1,086 మంది వైరస్​కు బలయ్యారు.

మృత్యుఘోష

ఇండోనేసియాలో కొవిడ్​ మరణమృదంగం కొనసాగుతోంది. రెండు మూడు రోజులుగా 17,00 పైగా మరణాలు నమోదవుతున్నాయి. మరోవైపు రోజువారీ కేసులు సగటున 35 వేలకుపైగా ఉంటున్నాయి.

ఇతర దేశాల్లో ఇలా..

  • ఇరాన్​లో​ ఒక్కరోజే 38,674 కరోనా కేసులు వెలుగుచూశాయి. మరో 434 మంది కొవిడ్​తో చనిపోయారు.
  • బ్రిటన్​లో తాజాగా 30,215 మందికి కొవిడ్​ సోకింది. మరో 86 మంది మరణించారు.
  • రష్యాలో కొత్తగా 23,120 మంది వైరస్​ బారిన పడ్డారు. మరో 794 మంది కొవిడ్​కు బలయ్యారు.
  • టర్కీలో ఒక్కరోజులో 24,297 మందికి వైరస్ సోకింది. తాజాగా 108 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • మెక్సికో తాజాగా 20,685 మంది కొవిడ్​ బారిన పడగా.. 611 మంది మరణించారు.
  • ఫ్రాన్స్​లో కొత్తగా 26,460 మందికి కొవిడ్ పాజిటివ్​గా తేలగా.. 52 మంది చనిపోయారు.
  • దక్షిణాఫ్రికాలో ఒక్కరోజే 13,646 కేసులు బయటపడగా.. 458 మంది మృతి చెందారు.

కంబోడియా, అర్జెంటినా సహా మరికొన్ని దేశాల్లో కేసులు, మరణాలు విపరీతంగా నమోదవుతున్నాయి.

ఇదీ చూడండి:'200 కోట్ల డోసులు విరాళంగా అందిస్తాం'

ABOUT THE AUTHOR

...view details