ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ కనిపెట్టేందుకు భారత్‌తో కలిసి పనిచేస్తున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఈ ఏడాది చివరికల్లా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని స్పష్టం చేశారు.
రోజువారీ మీడియా సమావేశంలో మాట్లాడిన ట్రంప్.. వ్యాక్సిన్ తయారీలో భాగం పంచుకున్న భారతీయ అమెరికన్లు గొప్ప శాస్త్రవేత్తలు, పరిశోధకులు అని కొనియాడారు.
"నేను ఈ మధ్యనే భారత్‌కు వెళ్లాను. ఆ దేశంతో కలిసి పనిచేస్తున్నాం. అంతేకాదు అమెరికాలో భారతీయుల జనాభా భారీగా ఉంది. వాళ్లు వ్యాక్సిన్ తయారీలోనూ భాగం పంచుకున్నారు. వాళ్లంతా గొప్ప శాస్త్రవేత్తలు, పరిశోధకులు. భారత్ చాలా గొప్ప కృషి చేస్తోంది. వ్యాక్సిన్ అభివృద్ధిలో సహకరించుకుంటున్నాం. భారత్‌తో కలిసి అదృశ్య శత్రువును చిత్తు చేస్తాం.
మీకు తెలుసు.. ప్రధాని మోదీ నాకు మంచి మిత్రుడు. భారత్‌లోని మన స్నేహితులకు వెంటిలేటర్లు విరాళంగా ఇస్తున్నామని ప్రకటించడం గర్వంగా ఉంది. మనం భారత్‌కు మద్దతుగా నిలవాలి."
- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు