అమెజాన్.. ప్రపంచంలో అతిపెద్ద ఈ కామర్స్ దిగ్గజం. అమెరికా కేంద్రంగా పని చేస్తున్న ఈ సంస్థ లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తోంది. అమెరికాలో అత్యధిక ఉద్యోగులున్న రెండో అతిపెద్ద ప్రైవేటు సంస్థ కూడా ఇదే. 1994లో తొలుత పుస్తకాల డెలివరీతో ప్రారంభమైన ఈ సంస్థ ప్రస్థానం ఇప్పుడు ఎలాంటి వస్తువైనా.. అమెజాన్‌లో దొరుకుతుంది అనే స్థాయికి చేరింది. 26 ఏళ్ల కాలంలో ఎన్నో ఆటుపోట్లను దాటుకుని ఈ స్థాయికి చేరింది అమెజాన్.
అయితే వ్యాపారాల్లో పోటీ, ఇతర కారణాలతో గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్న అమెజాన్ ఇప్పుడు.. సొంత ఉద్యోగుల పట్ల తీసుకుంటున్న నిర్ణయాలతో వివాదంలో చిక్కుకుంది. ఉద్యోగులు సంస్థను విమర్శిస్తుండటం, వారికి ప్రముఖుల మద్దతు లభించడం.. సిబ్బందికి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలు.. ఇవన్నీ ఇప్పుడు అమెజాన్‌కు తలనొప్పిగా మారాయి.
పని విధానాలు, వేతనాలు సహా వివిధ అంశాల్లో అమెజాన్‌పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఉద్యోగులు. ఇదే అభిప్రాయంతో ఉన్నవారంతా ఓ యూనియన్ ఏర్పాటు చేయాలనుకోవడమే ఈ వివాదానికి ప్రధాన కారణం.
వివాదానికి ప్రారంభమిది..
అలబామా బెస్సెమెర్లో ఉన్న అమెజాన్ వేర్‌హౌస్ నుంచి ఈ వివాదం ప్రారంభమైంది. వేతనాలు, పని పరిస్థితులు సహా ఇతర అంశాల్లో అక్కడి ఉద్యోగులు కొంత కాలంగా కంపెనీపై అసంతృప్తిగా ఉన్నారు. ఈ విషయాన్ని కంపెనీ దృష్టికి తీసుకెళ్లాలనే ప్రయత్నంలో భాగంగా ఉద్యోగులంతా కలిసి యూనియన్‌గా ఏర్పడాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం తెలిసిన కంపెనీ యూనియన్ ఏర్పాటుకు వ్యతిరేకంగా చర్యలు ప్రారంభించింది. దీనితో ఉద్యోగులు, సంస్థ మధ్య వివాదం మరింత ముదిరింది.
ఉద్యోగ సంఘం ఏర్పాటుకు వ్యతిరేకంగా, అణచివేత ధోరణి ప్రదర్శిస్తోందంటూ.. అలబామా బెస్సెమెర్లోని ఓ అమెజాన్ ఉద్యోగి బహిరంగంగానే విమర్శలు చేశారు.
'ఉద్యోగులంతా యూనియన్‌గా ఏర్పడేందుకు ప్రయత్నిస్తున్నారనే విషయం తెలిసి మా వేర్‌హౌస్‌లో, బాత్రూమ్లలో కూడా 'నో ప్లేస్ వజ్ ఆఫ్ లిమిట్స్' అనే యాంటీ యూనియన్ సైన్లను కంపెనీ ఏర్పాటు చేసింది' అని జెన్నిఫర్ బేట్స్ అనే ఉద్యోగి తెలిపారు. వేతనాల్లో అసమానతల కేసుకు సంబంధించి వాషింగ్టన్ కోర్టులో విచారణలోనూ జెన్నిఫర్ సాక్షిగా ఉన్నారు.
వరుస సమావేశాలు
ఉద్యోగులతో అమెజాన్ యాజమాన్యం వరుస సమావేశాలు నిర్వహిస్తూ... యూనియన్‌గా ఏర్పడితే ఏం జరుగుతుందో పదేపదే చెబుతోందని అంటున్నారు జెన్నిఫర్.
'యూనియన్‌గా ఏర్పడితే తమకే (ఉద్యోగులకు) నష్టమని కంపెనీ ఏవేవో కారణాలు చెబుతోంది. కంపెనీ చెప్పిన విషయాలతో ఏకీభవించకుండా.. వారికి వ్యతిరేకంగా మాట్లాడితే.. సమావేశాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు' అని జెన్నిఫర్ చెప్పుకొచ్చారు.