అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్‌ను అధికారికంగా ఖరారు చేయడానికి జనవరి 7న అమెరికా కాంగ్రెస్ సమావేశమైనప్పుడు జరిగిన హింసాత్మక ఘటనను ప్రపంచం ఎప్పటికీ మర్చిపోలేదు. ఆ దాడి తర్వాత ఆందోళనలో పాల్గొని టీవీల్లో కనిపించిన కొందరిని గుర్తించి పోలీసులు అరెస్టు చేస్తున్నారు. అయితే ఈ విషయంలో సాయం చేయడం కోసం కొంతమంది మహిళలు డేటింగ్ యాప్‌ను ఉపయోగిస్తున్నారు. క్యాపిటల్ ఆందోళనలో పాల్గొన్నవారిని యాప్‌లో గుర్తించి ఎఫ్‌బీఐకి సమాచారం ఇస్తున్నారట. ఓ మహిళ ఈ విషయాన్ని బయటపెట్టడం వల్ల ఏకంగా ఆ డేటింగ్ యాప్ ఈ విషయంలో చర్యలు తీసుకోవడం విశేషం.
డేటింగ్ యాప్‌తో ఆందోళనకారుల గుట్టు రట్టు! - క్యాపిటల్ భవనం తాజా వార్తలు
అమెరికా క్యాపిటల్ భవనంపై దాడి చేసిన వారిని పట్టుకునేందుకు కొంతమంది మహిళలు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. ఆందోళనకారుల్ని డేటింగ్ యాప్‌లో గుర్తించి ఎఫ్‌బీఐకి సమాచారం ఇస్తున్నారట. ఓ మహిళ ఈ విషయాన్ని బయటపెట్టడం వల్ల ఏకంగా ఆ డేటింగ్ యాప్ ఈ విషయంలో చర్యలు తీసుకుంది.
కొంతమంది మహిళలు 'బంబుల్' అనే డేటింగ్ యాప్‌లో కావాలని తమ కంటెంట్ ప్రాధాన్యతను రాజకీయం విభాగానికి మార్చుకున్నారు. అనంతరం ఆ విభాగంలో వచ్చే వ్యక్తుల్ని పరిచయం చేసుకుంటున్నారు. ఎవరైనా తాము క్యాపిటల్ ఆందోళనలో పాల్గొన్నామని గొప్పగా చెప్పుకుంటూ ఫొటోలు, వీడియోలు పంపిస్తే.. వాటిని ఎఫ్‌బీఐకి పంపుతున్నారు. తనకు తెలిసిన ఓ మహిళ ఈ విధంగా ఆందోళనకారుల్ని డేటింగ్‌యాప్‌లో గుర్తించి ఎఫ్‌బీఐకి సమాచారం ఇస్తోందని అలిన్ అనే మహిళ ట్వీట్ చేయడంతో ఈ విషయం చర్చనీయాంశమైంది. క్యాపిటల్ భవనంలో విధ్వంసం సృష్టించిన వ్యక్తులు ఈ యాప్‌లో ఉన్నారని తెలియడం వల్ల "అలాంటి వ్యక్తుల్ని మీ యాప్‌లో యూజర్లుగా ఉండనిస్తారా?" అని బంబుల్‌ను నెటిజన్లు ప్రశ్నించడం మొదలుపెట్టారు. వారిని పట్టిస్తున్న మహిళలను అభినందిస్తున్నారు.
దీంతో ఈ విషయంపై బంబుల్ యాజమాన్యం స్పందించింది. "చట్టవిరుద్ధ కంటెంట్‌ను బంబుల్ ఉపేక్షించదు. మా పాలసీని ఉల్లంఘించిన, క్యాపిటల్ ఆందోళనలో పాల్గొన్న యాప్ యూజర్ల అకౌంట్లను తొలగిస్తాం" అని ఇటీవల ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌కు సమాధానం ఇచ్చింది. అలాగే, యాప్‌లో రాజకీయం విభాగాన్ని తాత్కాలికంగా తొలగించింది.