40 ఏళ్ల ఓ మహిళ.. తన భర్త మరణించిన 14 నెలల తర్వాత ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అదెలా అని ఆశ్చర్యపోతున్నారా? మీరు చదివింది నిజమే. భద్రపరిచిన పిండం ద్వారా సారా షెలెన్‌బెర్గర్ అనే మహిళ ఈ ఫీట్‌ను సాధించింది. అమెరికాలోని ఓక్లహామాకు చెందిన ఆమె మే 3న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.
చిన్నారి రాకతో తన మాతృహృదయం సంతృప్తి చెందిందని.. బిడ్డను గుండెలకు హత్తుకోవడం గొప్ప అనుభవాన్ని ఇస్తోందని సారా పేర్కొంది. ఆమె భర్త స్కాట్(41) గతేడాది ఫిబ్రవరిలో గుండెపోటుతో మరణించారు. అతను మరణించిన ఆరు నెలల అనంతరం.. బార్బడోస్ ఫెర్టిలిటీ క్లినిక్ సహకారంతో సారా ఈ ప్రక్రియను పూర్తి చేసింది.
"మేం కనీసం ముగ్గురు పిల్లల్ని కనాలని భావించేవాళ్లం. ఈ సమయంలో బిడ్డకు జన్మనివ్వాలన్న నిర్ణయానికి నా భర్త మద్దతు ఉందని కచ్చితంగా చెప్పగలను. బిడ్డ పుట్టినప్పటి నుంచి నా జీవితానికి ఒక అర్థం లభించింది. నా పిల్లలకు తండ్రిలేని లోటు లేకుండా పెంచుతా."
-సారా షెలెన్‌బెర్గర్