మనలో చాలామంది టీకా తీసుకుంటే కరోనా సోకదని భావిస్తూ ఉండొచ్చు. అయితే.. డెల్టా, కప్పా సహా ఇతర వేరియంట్ల కారణంగా వేగంగా పెరుగుతున్న కొత్త కేసుల వ్యాప్తి కలవరపెడుతోంది. అంతేగాక.. టీకా తీసుకున్నవారికీ కరోనా సోకడం మరింత ఆందోళన కలిగిస్తోంది. అయితే ఈ అంశంపై విస్తృత పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు.. వైరస్ ముప్పు మళ్లీ తప్పదని హెచ్చరిస్తున్నారు. టీకాలు చాలావరకు కరోనా వ్యాప్తిని అడ్డుకుంటాయని.. అయితే అది తాత్కాలికమేనని అంటున్నారు. దీనినే 'బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్'గా అభివర్ణిస్తున్నారు. టీకా తీసుకున్నప్పటికీ కరోనా సోకుతుందా? సోకితే ఏ మేరకు ప్రమాదకరం? అనే అంశాలను ఓసారి పరిశీలిద్దాం..
బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్ అంటే?
వ్యాక్సిన్ రెండు డోసులు పూర్తయిన 14 రోజుల తర్వాత కరోనా సోకితే దీనిని బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్గా అమెరికా అంటు వ్యాధుల నియంత్రణ సంస్థ నిర్ధరించింది. ఈ నేపథ్యంలో వివిధ వ్యాధుల నివారణకు అందించే టీకాల్లో ఏది కూడా 100 శాతం ప్రభావవంతంగా లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
- పోలియో వ్యాక్సిన్ 80-90 శాతం, మీజిల్స్ టీకా(తట్టు వ్యాధి) 94 శాతం సామర్థ్యంతో పనిచేస్తాయని ఉదహరిస్తున్నారు. అందువల్లే వాటి ముప్పు పూర్తిగా తొలగిపోలేదని.. దీని ప్రకారం రెండు డోసుల టీకా తీసుకున్నప్పటికీ కరోనా ముప్పు ఉంటుందని పేర్కొన్నారు.
- 'ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్లు 95 శాతం ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు క్లినికల్ ట్రయల్స్‌లో తేలింది. కరోనాపై పోరుకు ఇది శుభపరిణామమే అయినప్పటికీ.. మిగతా 5 శాతం మంది వైరస్ బారిన పడేందుకు అవకాశం ఉన్న విషయాన్ని మర్చిపోకూడదు' అని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
టీకా తీసుకుంటే వైరస్ వ్యాప్తి సాధారణమేనా?
ఇప్పటికీ సాధారణ, తేలికపాటి లక్షణాలతో వ్యాక్సిన్లు తీసుకున్న వారికి కరోనా సోకుతోంది. టీకాతో గరిష్ఠ రక్షణ ఉన్నప్పటికీ.. ప్రస్తుతం డెల్టా వేరియంట్ వేగంగా వ్యాపిస్తున్నందున జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.
- అమెరికాలో జరిగిన ఓ అధ్యయనం ప్రకారం.. 2020 డిసెంబర్లో 2,58,716 మంది ఫైజర్, మోడెర్నాలలో ఏదో ఒక టీకా తీసుకోగా వారిలో 410 అంటే 0.16 శాతం మందికి మాత్రమే వైరస్ సోకింది.
- అదేవిధంగా న్యూయార్క్‌లో టీకా రెండు డోసులు తీసుకున్న 1,26,367 వారిలో 2021 ఫిబ్రవరి-ఏప్రిల్ మధ్య 86 బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్ కేసులు నమోదయ్యాయి. ఇది మొత్తం కేసుల్లో 1.2 శాతం.
బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్ తీవ్రత ఎంత?
టీకా తీసుకున్న వారిలో 27 శాతం మందికి లక్షణాలు లేకుండానే వైరస్ సోకుతుంది. 10 శాతం మంది మాత్రమే ఆసుపత్రిలో చేరుతుండగా.. రెండు శాతం మంది మరణిస్తున్నారు. అదే సమయంలో టీకాలు అందుబాటులోకి రాకముందు ఈ తరహా కేసుల్లో నమోదైన మరణాలు ఆరు శాతం.
ఇదీ చదవండి:ప్రపంచ దేశాల్లో కేసులు తీవ్రం- మూడోవేవ్ మొదలైనట్టేనా?