కరోనా టీకా పంపిణీలో ప్రపంచదేశాల మధ్య అసమానతలపై ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. పది దేశాలకే 75శాతం డోసులు అందాయని సంస్థ ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ పేర్కొన్నారు. ఇది 'క్రూరమైన అసమానత, అన్యాయం'గా అభివర్ణించారు. ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజలకు వీలైనంత త్వరగా టీకా అందించేందుకు అంతర్జాతీయ స్థాయిలో చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఐరాస భద్రతా మండలి అత్యున్నత సమావేశానికి హాజరైన ఆయన.. 130 దేశాలకు కొవిడ్ టీకా ఒక్క డోసు కూడా అందలేదని తెలిపారు. వ్యాక్సిన్ సమానత్వమే ప్రపంచం ముందు ప్రస్తుతమున్న అతిపెద్ద నైతిక సవాలని అన్నారు.
ఏకతాటిపైకి తేవాలి
టీకా పంపిణీ కోసం 'గ్లోబల్ వ్యాక్సినేషన్ ప్లాన్'ను రూపొందించడం అత్యవసరమని అభిప్రాయపడ్డారు గుటెరస్. శాస్త్రవేత్తలు, వ్యాక్సిన్ ఉత్పత్తిదారులతో పాటు.. పంపిణీకి నిధులు సమకూర్చేవారిని ఏకతాటిపైకి తీసుకురావాలని అన్నారు. ఇందుకోసం జీ20 దేశాలు ఎమర్జెన్సీ టాస్క్ఫోర్స్ను నెలకొల్పాలని సూచించారు.