కరోనా లాక్డౌన్: వేర్వేరు దేశాల్లో ఇదీ పరిస్థితి కరోనా వైరస్ నియంత్రణే లక్ష్యంగా అనేక దేశాలు లాక్డౌన్ అమలు చేస్తున్నాయి. వందల కోట్ల మంది ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. ఫలితంగా నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాలన్నీ ప్రస్తుతం వెలవెలబోయాయి.
కేరింతలు, ఈలలతో
అమెరికాలోని మయామిలో అక్కడి ప్రభుత్వం శనివారం కర్ఫ్యూ విధించింది. తొలిరోజు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నగరమంతా కర్ఫ్యూను స్వచ్ఛందంగా పాటించారు ప్రజలు. తమ నివాసాల్లోని బాల్కానీల్లో సాయంత్రం పూట కేరింతలు, ఈలలు, ప్లాష్ లైట్స్‌తో కర్ఫ్యూకు మద్దతు పలికారు. వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
మయామిలో ఇప్పటివరకు కరోనా వల్ల 45 మంది మరణించారు. 3,200మందికి పాజిటివ్ అని తేలింది.
ఇంటికే పరిమితమై
కరోనా వల్ల తక్కువ సంఖ్యలో మరణాలు సంభవించిన ఐరోపా దేశాల్లో ఐర్లాండ్ ఒకటి. వైరస్‌ను పూర్తిస్థాయిలో తరిమికొట్టేందుకు ఆ దేశ ప్రభుత్వం లాక్‌డౌన్‌ను పటిష్ఠంగా అమలు చేస్తోంది. ప్రజలు రోడ్లపైకి రాకుండా చూసేందుకు భద్రతా బలగాలను మోహరించింది. ఫలితంగా అక్కడి రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనపడ్డాయి.
ఇప్పటివరకు ఐర్లాండ్‌లో 2 వేలకు పైగా కేసులు నమోదవ్వగా 22మంది మరణించారు.
స్పెయిన్‌లో...
ప్రపంచంలో కరోనా వల్ల అత్యధిక మరణాలు సంభవించిన దేశాల్లో స్పెయిన్ ఒకటి. దాదాపు 6 వేల మందికి పైగా మరణించారు. లక్షల మంది వైరస్ బారిన పడ్డారు. కరోనా నియంత్రణకు ప్రాణాలకు తెగించి వైద్యులు, నర్సులు పనిచేస్తున్నారు. అలాంటి వారందరికీ కృతజ్ఞతలు తెలిపి, నూతనోత్సాహం నింపే ప్రయత్నం చేశారు మాడ్రిడ్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది. కాసేపు చప్పట్లు కొట్టి... వైద్యులను అభినందించారు.
ఇదీ చూడండి : చైనాలో కట్టలు తెంచుకున్న ప్రజాగ్రహం- పోలీసులపై దాడి