అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై నెలకొన్న ఉత్కంఠ ఇంకా వీడడం లేదు. ఇంకా ఐదు కీలక రాష్ట్రాల్లో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. నెవాడాలో కౌంటింగ్ మరీ నెమ్మదిగా సాగుతోంది. దాదాపు 87 శాతం ఓట్లు మాత్రమే ఇప్పటి వరకు లెక్కించారు. మిగిలిన ఓట్ల కౌంటింగ్‌లో మరింత జాప్యం జరుగుతోంది. ఇది అక్కడ సామాజిక మాధ్యమాల్లో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. అసలు అక్కడ ఇంత ఆలస్యం ఎందుకు అవుతుందో ఓసారి చూద్దాం..
జాప్యానికి మూలం..
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఓటర్లందరికీ మెయిల్-ఇన్ బ్యాలెట్లు పంపాలని రాష్ట్ర చట్టసభ తీర్మానించింది. ఎన్నికలు ముగిసిన తర్వాత వారం రోజుల వరకు వచ్చే పోస్టల్ ఓట్లను స్వీకరించేందుకు అనుమతించింది. అయితే, అవి ఎన్నికల తేదీ లేదా అంతకంటే ముందు వేసినవి అయి ఉండాలి. ఈ నేపథ్యంలో ఇప్పటికీ అక్కడ పోస్టల్ ఓట్లు వచ్చి పడుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో రెండో అతిపెద్ద కౌంటీ అయిన వాషూలో గతంలో మునుపెన్నడూ లేని స్థాయిలో మెయిల్ ఓట్లు నమోదయ్యాయని ఎన్నికల అధికారి డియన్నా స్పికులా తెలిపారు.
ఎక్కడి వరకు వచ్చింది..
ఇప్పటి వరకు ఏ మీడియా సంస్థ నెవాడాలో విజేతను ప్రకటించలేదు. శుక్రవారం సాయంత్రానికి 87 శాతం ఓట్లు లెక్కించారు. ముందు నుంచీ ఆధిక్యంలో ఉన్న బైడెన్ ప్రస్తుతం 22,657 ఓట్లతో ముందంజలో ఉన్నారు. ఇంకా లక్షల ఓట్లు లెక్కించాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు లెక్కించని ఓట్లలో క్లార్క్ కౌంటీకి చెందినవే ఎక్కువని పేర్కొననారు. ఈ కౌంటీలో లాస్‌వెగాస్ నగరం సహా జనాభా ఎక్కువగా ఉండే శివారు ప్రాంతాలు ఉన్నాయి. లెక్కించని ఓట్లలో చాలా రకాలు ఉన్నాయని.. వాటిలో కొన్నింటినీ పలు అంచెల్లో తనిఖీ చేయాల్సి ఉందని అధికారులు తెలిపారు.