కరోనా టీకాపై మేధో సంపత్తి హక్కులను రద్దు చేస్తున్నట్టు అమెరికా ప్రకటించడం సర్వత్రా చర్చకు దారితీసింది. ఇది గొప్ప విషయమని, పేద దేశాలకు వ్యాక్సిన్లు చేరడానికి ఇది ఉపయోగపడుతుందని పలువురు నిపుణులు, సామాజిక కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. కానీ ఈ నిర్ణయాన్ని అమెరికాలోని ఫార్మా సంస్థలు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నాయి. ఫలితంగా ఈ వ్యవహారం వివాదాస్పదమైంది. దీని వల్ల గందరగోళం ఏర్పడటం తప్ప అసలు ఎలాంటి ఉపయోగం లేదన్నది ఔషధ సంస్థల వాదన. అసలు ఆయా సంస్థలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? అసలు ఈ 'పేటెంట్స్' వ్యవహారమేంటి?
పేటెంట్స్ ఎలా పనిచేస్తాయి?
ఓ కంపెనీ చేసే ఆవిష్కరణలను ఇతర కంపెనీలు కాపీ కొట్టకుండా చూసుకునేందుకు ఈ పేటెంట్స్ ఉపయోగపడతాయి. అమెరికాలో ఫైల్ చేసిన సమయం నుంచి ఔషధాలపై పేటెంట్స్ 20ఏళ్లు ఉంటాయి.
సాధారణంగా.. ఔషధాలు ఆవిష్కరించిన వెంటనే పేటెంట్స్‌కు దరఖాస్తు చేసుకుంటాయి కంపెనీలు. ఎందుకంటే.. ఔషధాలపై ప్రయోగాలు, ఆవిష్కరణ అనుమతుల వరకు ఒక్కోసారి దశాబ్ద కాలం కూడా గడిచిపోవచ్చు. అనంతరం పోటీ లేకుండా 12ఏళ్ల వరకు ఔషధాలను అమ్ముకోవడానికి వీలుంటుంది. అదే సమయంలో తమ ఉత్పత్తులను మెరుగుపరుచుకుని, వాటి వినియోగాన్ని విస్తృతం చేసేందుకు కంపెనీలు ఆసక్తిగా ఉంటాయి. ఇందుకు అదనపు హక్కులను కూడా సొంతం చేసుకుంటాయి.
ఇదీ చూడండి:-'మేధో హక్కుల రద్దు'కు పెరుగుతున్న మద్దతు.. కానీ!
పేటెంట్ ఉన్న వస్తువు తయారీదార్లకు ఎందుకంత ముఖ్యం?
ఔషధాలను అభివృద్ధి చేయడం భారీ ఖర్చుతో కూడిన వ్యవహారం. దీని వెనుక ఎన్నో ఏళ్ల శ్రమ ఉంటుంది. ల్యాబ్‌లలో జంతువులు, మనుషుల మీద ప్రయోగాలు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో.. ఏదో ఒక దశలో ఔషధాలు విఫలమవుతూ ఉంటాయి. వాటిని సరిచేయాల్సి ఉంటుంది. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుంటే.. ఓ ఔషధం.. ఆవిష్కరణ దశ నుంచి నియంత్రణ సంస్థ అనుమతులు పొందేంత వరకు 1 బిలియన్ డాలర్లకు మించిన వ్యయం అవుతుంది. ఇన్ని చేశాక పోటీదారుల నుంచి ఔషధ ఫార్ములాను కాపాడుకోవడం ముఖ్యం. అందుకే పేటెంట్వైపు వెళతాయి సంస్థలు.
కొవిడ్-19 వ్యాక్సిన్‌పై మేధో సంపత్తి హక్కుల రద్దును అమెరికా ఎందుకు సమర్థిస్తోంది?
మేధో సంపత్తి హక్కుల రద్దుకు భారత్, దక్షిణాఫ్రికా ప్రతిపాదించగా.. అనేక దేశాల నుంచి మద్దతు లభిస్తోంది. అదే సమయంలో.. ప్రపంచ దేశాలకు కరోనా వ్యాక్సిన్ అందించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వంపై ఒత్తిడి తీవ్రస్థాయిలో ఉంది. కాంగ్రెస్‌లోని అనేకమంది దౌత్యవేత్తలు ఈ విషయంపై పట్టుబడుతున్నారు.
మరి ఈ ప్రతిపాదనను గతంలో అమెరికా ఎందుకు వ్యతిరేకించింది?