అమెరికా తొలి అధ్యక్షుడిగా జార్జ్ వాషింగ్టన్ ఎన్నికైన సమయంలో ఆ దేశంలో రాజకీయ పార్టీ ఒక్కటి కూడా లేదు. రాజ్యాంగానికి మద్దతిచ్చే ఫెడరలిస్టుల తరఫున అధ్యక్షుడిగా ఎన్నికై 1789 నుంచి 1797 వరకు సేవలందించారు. రాజకీయ పార్టీల వ్యవస్థ దేశాభివృద్ధికి మంచిది కాదని వాషింగ్టన్ నమ్మేవారు. పార్టీల మధ్య ఘర్షణలతో అభివృద్ధి కుంటుపడుతుందని, అందుకే భవిష్యత్తులో రాజకీయ పార్టీలు ఉండకూడదనే కోరుకున్నారు.
ఇదీ చదవండి:ట్రంప్ X బైడెన్: కీలక రాష్ట్రాల్లో ఎవరిది పైచేయి?
కానీ.. ఆయన ఆకాంక్షను వమ్ముచేస్తూ ఆయనతో కలిసి పనిచేసిన వారే కొత్త పార్టీల ఏర్పాటుకు ఆద్యులయ్యారు. అమెరికా నిర్మాణంలో వాషింగ్టన్‌తోపాటు జేమ్స్ మాడిసన్, అలెగ్జాండర్ హమిల్టన్ ముఖ్య పాత్ర వహించారు. అయితే.. దేశానికి బలమైన ఒక కేంద్ర ప్రభుత్వం ఉండాలి, కేంద్ర బ్యాంకింగ్ వ్యవస్థ ఉండాలి, బ్రిటన్‌తో సత్సంబంధాలు కలిగి ఉండాలి వంటి సిద్ధాంతాలకు మద్దతిచ్చే హమిల్టన్ నేతృత్వంలో 1789లోనే ఫెడరలిస్ట్ పార్టీ ఏర్పడింది. అయితే.. వీటిని పూర్తిగా వ్యతిరేకిస్తూ జేమ్స్ మాడిసన్, థామస్ జెఫర్సన్ నేతృత్వంలో 1792 డెమోక్రటిక్-రిపబ్లిక్ పార్టీ వెలసింది. ఇవే అమెరికా రాజకీయ చరిత్రలో తొలి పార్టీలుగా నిలిచాయి. వాషింగ్టన్ పదవి నుంచి దిగిపోయాక 1797-1801 మధ్య ఫెడరలిస్ట్ పార్టీ నుంచి జాన్ ఆడమ్స్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు.
ఇదీ చదవండి:అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ ఇంత సంక్లిష్టమా?
ఫెడరలిస్ట్... అలా పోయింది
ఫెడరలిస్ట్ సిద్ధాంతాలను వ్యతిరేకిస్తూ ఏర్పాటైన డెమోక్రటిక్-రిపబ్లికన్ పార్టీ 1800లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించింది. జెఫర్సన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత నాలుగు సార్లు ఈ పార్టీనే అధికార పీఠంపై కూర్చుంది. రెండు సార్లు జెఫర్సన్ అధ్యక్షుడిగా ఉండగా..ఆయన తర్వాత జేమ్స్ మాడిసన్ 1809-1817 మధ్య దేశాధినేతగా వ్యవహరించారు. ఈ కాలంలో ఫెడరలిస్ట్ పార్టీ బాగా బలహీనపడింది. అయితే.. 1812లో జరిగిన అమెరికా యుద్ధానికి మద్దతు ఇవ్వకపోవడం వల్ల ఫెడరలిస్ట్‌పార్టీ మరింత దెబ్బతింది. ఫలితంగా జేమ్స్ మన్రో(డెమోక్రటిక్-రిపబ్లికన్ పార్టీ, 1816-1824)అధ్యక్షుడిగా ఉన్న కాలంలో ఫెడరలిస్ట్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది.
మళ్లీ చీలిక
రాజకీయ పార్టీలో సంఘర్షణ ఎప్పుడూ ఉంటుంది. అది బయటపడిన రోజు పార్టీలో చీలికలు తప్పవు. డెమోక్రటిక్-రిపబ్లికన్ విషయంలోనూ అదే జరిగింది. 1828లో పార్టీ రెండుగా చీలి ఆండ్రూ జాక్సన్ నేతృత్వంలో డెమోక్రటిక్ పార్టీతో పాటు నేషనల్ రిపబ్లికన్ పార్టీ ఏర్పాడ్డాయి. 1833లో నేషనల్ రిపబ్లిక్ పార్టీ.. విగ్ పార్టీగా మారింది. 1841-1853 మధ్య కాలంలో విగ్ పార్టీ నుంచి నలుగురు నేతలు దేశాధ్యక్షులయ్యారు. కానీ.. పలు కారణాల వల్ల 1860లోపే విగ్ పార్టీ కనుమరుగైంది.