ఇప్పుడు ప్రపంచ దేశాల ఆశలన్నీ వ్యాక్సిన్ పైనే. కరోనా సంక్షోభం నుంచి తమను గట్టెక్కించేది వ్యాక్సిన్ ఒక్కటేనని ప్రజలు భావిస్తున్నారు. అనేక మంది శాస్త్రవేత్తలు.. కరోనాకు వ్యాక్సిన్‌ను కనుగొనేందుకు ఇప్పటికే తీవ్రంగా శ్రమిస్తున్నారు. కానీ వ్యాక్సిన్‌ను రూపొందించాక.. అది ముందుగా ఎవరికి అందుతుంది? అనే విషయంపై ఇప్పుడిప్పుడే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే.. ఏ దేశమైతే వ్యాక్సిన్‌ను కనుగొంటుందో.. ఆ దేశ ప్రజలకే అది ముందుగా అందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
లక్షల్లో ఆర్డర్లు...
బ్రిటన్, చైనా, అమెరికా సహా వేర్వేరు దేశాలకు చెందిన డజనుకుపైగా సంస్థలు వ్యాక్సిన్‌పై ప్రయోగాలు చేస్తున్నాయి. ఇవి వివిధ దశల్లో ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ)తో పాటు అమెరికా అలర్జీ, అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీ కూడా.. వచ్చే ఏడాది వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
పరిశోధనలు ప్రయోగ దశలో ఉన్నప్పటికీ.. సంపన్న దేశాలు ఇప్పటికే లక్షల డోసులను ఆర్డర్ ఇచ్చేశాయి.
ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌ను ఆస్ట్రాజెనికా సంస్థ ఉత్పత్తి చేయనుంది. ఇందులో బ్రిటన్, అమెరికా దేశాలు పెట్టుబడులు పెట్టాయి. ఒకవేళ ఈ పరిశోధనలు విజయవంతమైతే.. బ్రిటన్వాసులకే తొలి ప్రాధాన్యముంటుందని ఆ దేశ నేతలు ఇప్పటికే స్పష్టం చేశారు. అమెరికా కూడా భారీ సంఖ్యలో ఆర్డర్లు ఇచ్చింది. అంతే కాకుండా ఇతర పరిశోధనలకూ సహకారం అందిస్తోంది.