Who On Covid Test: కరోనా థర్డ్‌వేవ్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా పెరిగిపోయిన కేసులు ప్రస్తుతం తగ్గుముఖం పడుతున్నాయి. కేసుల సంఖ్య దిగివస్తుండటంతో పరీక్షలు చేయడంలో అలసత్వం కనిపిస్తోంది. అయితే ఇలా వ్యవహరించడం ఏమాత్రం శ్రేయస్కరం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. వ్యాప్తిలో ఉన్న వైరస్‌ను కట్టడి చేయాలన్నా.. పుట్టుకొచ్చే కొత్త వేరియంట్లను గుర్తించాలన్నా టెస్టులు కీలకమని, వాటిని కొనసాగించాలని డబ్ల్యూహెచ్‌ఓ సాంకేతిక విభాగాధిపతి మరియా వాన్ కెర్ఖోవ్ పేర్కొన్నారు.
'వైరస్ ఎక్కడ, ఎలా ఉంది? ఎలా రూపాంతరం చెందుతోందనే విషయాలను తెలుసుకోవాలి. తద్వారా కట్టడి చర్యలు తీసుకోవచ్చు' అని మరియా కెర్ఖోవ్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ పరీక్షలు ఒక్కసారిగా పడిపోయినట్లు తాము గుర్తించామని పేర్కొన్నారు. ఓ వ్యక్తికి వైరస్ సోకిందని తెలిసేందుకు గానీ వైద్యం అందించేందుకు గానీ ముందుగా అతడికి పరీక్షలు చేయాల్సిందేనని ఆమె పునరుద్ఘాటించారు. అందుకే టెస్టుల్లో అలసత్వం వహించకూడదని ఆమె కోరారు. వైరస్‌ను గుర్తించేందుకు నాణ్యమైన టెస్ట్ కిట్‌లు అవసరమని మరియా సూచించారు. వినియోగానికి వీలుగా, వేగంగా ఫలితాలను చూపించే, నాణ్యమైన కిట్‌లను వినియోగించాలన్నారు.