WHO New COVID cases: కరోనా వ్యాప్తి తగ్గుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ- డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా గత వారం కోటీ 60 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయని వెల్లడించింది. మరో 75 వేల మందికిపైగా వైరస్‌కు బలయ్యారని స్పష్టం చేసింది.
కొత్త కేసుల్లో 19 శాతం తగ్గుదల కనిపించిందని ప్రతి వారం విడుదల చేసే నివేదికలో పేర్కొంది డబ్ల్యూహెచ్ఓ. మరణాల సంఖ్య స్థిరంగా కొనసాగుతోందని తెలిపింది.
డబ్ల్యూహెచ్ఓ నివేదిక ప్రకారం..
- పశ్చిమ పసిఫిక్ ప్రాంతంలో.. వారం వ్యవధిలోనే కరోనా కేసుల్లో 19 శాతం పెరుగుదల కనిపించింది.
- ఆగ్నేయాసియాలో 37 శాతం తగ్గిన కేసులు.
- పశ్చిమాసియాలో 38 శాతం పెరిగిన కరోనా మరణాలు
- ఆల్ఫా, బీటా, డెల్టా సహా ఇతర కరోనా వేరియంట్లు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ప్రస్తుతానికి 98 శాతానికిపైగా ఒమిక్రాన్ కేసులే నమోదవుతున్నాయి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. వారంలో కరోనా కొత్త కేసులు రష్యాలో అత్యధికంగా వెలుగుచూశాయి. ఒమిక్రాన్‌లో బీఏ.2 రకం క్రమంగా విజృంభిస్తోందని తెలిపిన డబ్ల్యూహెచ్ఓ.. దక్షిణాఫ్రికా, డెన్మార్క్, యూకే వంటి దేశాల్లో దీని ప్రభావం కనిపిస్తోందని పేర్కొంది. ఇది అంతకుముందు ఉన్న ఉపవేరియంట్ బీఏ-1 కంటే మరింత వేగంగా వ్యాప్తి చెందుతుందని వెల్లడించింది.
డబ్ల్యూహెచ్ఓ సాంకేతిక శాస్త్రవేత్త మరియా వాన్ కెర్కోవ్ కొద్దిరోజుల క్రితం బీఏ.2 రకం గురించి వ్యాఖ్యానించారు. ఆమె ఏం అన్నారంటే..
- పలు దేశాల్లో ఒక్కసారిగా పెరిగి.. అదే స్థాయిలో కేసుల్లో తగ్గుదల కనిపిస్తోంది.
- ఈ కొత్త ఇన్‌ఫెక్షన్లకు BA-2 ఉపవేరియంట్ కారణమా కాదా అన్నది ప్రస్తుతం డబ్ల్యూహెచ్ఓ పర్యవేక్షిస్తోంది.
- ఇప్పటివరకు జరిగిన పరిశోధనల్లో ఈ కొత్త ఉపవేరియంట్ కారణంగా తీవ్రమైన ఇన్‌ఫెక్షన్లు రాలేదు.
- తీవ్రమైన ఇన్‌ఫెక్షన్లు, మరణాల నుంచి రక్షించేందుకు కరోనా వ్యాక్సిన్లు అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తున్నాయి.
- టీకాలు వేసుకోవాలి. మాస్కులు తప్పనిసరిగా ధరించాలి.
వారికి నాలుగో డోసు..
Booster Dose: ఒమిక్రాన్‌పై పోరాటంలో భాగంగా అమెరికాలో పౌరులకు నాలుగో డోసూ వేయాల్సిన అవసరం రావొచ్చని ఇటీవల అభిప్రాయపడ్డారు ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు, దేశాధ్యక్షుడి ప్రధాన వైద్య సలహాదారు ఆంటోని ఫౌచీ. ప్రజల వయస్సు, వ్యక్తిగత ఆరోగ్య సమస్యల ఆధారంగా ఈ డోసు వేయాల్సి ఉంటుందన్నారు. దేశంలో నాలుగో డోసు అవసరంపై విలేకరులు అడిగిన ప్రశ్నలపై డా.ఫౌచీ స్పందిస్తూ.. ఈ అంశాన్ని దగ్గరి నుంచి గమనిస్తున్నట్లు తెలిపారు. ఈ పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇవీ చూడండి:'కరోనా కొత్త వేరియంట్ డేంజర్ బెల్స్'- డబ్ల్యూహెచ్ఓ వార్నింగ్
సముద్రంలో మునిగిన వ్యక్తికి కరోనా టెస్టులు- 41రోజుల్లో 28సార్లు పాజిటివ్!