కరోనా వైరస్‌కు ఏడాదిలోపు వ్యాక్సిన్ వస్తుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ గెబ్రెయేసస్ అన్నారు. వ్యాక్సిన్ అభివృద్ధి, ఉత్పత్తి, సరఫరాకు అంతర్జాతీయ సహకారం అత్యంత ఆవశ్యకమని పేర్కొన్నారు. పర్యావరణం, ప్రజారోగ్యం, ఆహార భద్రతపై ఏర్పాటైన ఐరోపా పార్లమెంట్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.
బలహీనులకు వ్యాక్సిన్.. ఓ ప్రత్యామ్నాయం
కొవిడ్-19 వ్యాక్సిన్ అందరికీ అందుబాటులో రావడం సవాలేనని అధానోమ్ అన్నారు. ఇందుకు రాజకీయ శక్తి అవసరం ఉందని చెప్పారు. వైరస్ బారినపడే అవకాశం ఉన్నవారికి, బలహీనులకు మాత్రమే సూదిమందు ఇవ్వడం ఓ ప్రత్యామ్నాయమని పేర్కొన్నారు. దేశాల మధ్య పరస్పర సహకార అవసరాన్ని మహమ్మారి నొక్కి చెప్పిందన్నారు అధానోమ్. కరోనా వేళ ఆరోగ్యాన్ని ఖర్చుగా కాకుండా పెట్టుబడిగా చూడాలన్నారు. దేశాలన్నీ ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసుకోవాలని సూచించారు. సంక్షోభాన్ని ఎదుర్కొనే అత్యవసర సన్నద్ధత ఉండాలని పేర్కొన్నారు.