కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అంతర్జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. చాలా అరుదైన సందర్భాల్లోనే ఇలాంటి అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తుంటారు. దీని వల్ల కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంలో దేశాల మధ్య మంచి సమన్వయం సాధించడానికి వీలవుతుంది. అటు చైనాలో కరోనా మృతుల సంఖ్య 212కు చేరినట్లు అధికారులు తెలిపారు.
"బలహీనమైన ఆరోగ్య వ్యవస్థలున్న దేశాలకు కరోనా వైరస్ వ్యాపించే అవకాశముంది. అదే మాకు ఆందోళన కలిగిస్తోంది. అందుకే అంతర్జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించాం."-టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్, డబ్ల్యూహెచ్ఓ చీఫ్
చైనాకు వ్యతిరేకంగా కాదు
అంతర్జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించడం అనేది... చైనాపై విశ్వాసం లేకపోవడం కానేకాదని టెడ్రోస్ నొక్కి చెప్పారు. కేవలం ఆరోగ్య వ్యవస్థలు సరిగా లేని దేశాలకు సహాయం చేయడమే తమ ఉద్దేశమని స్పష్టం చేశారు. కరోనాను అరికట్టేందుకు చైనా తీసుకుంటున్న చర్యలను ఆయన ప్రశంసించారు.