ప్రపంచ ఆరోగ్య సంస్థకు తమ దేశం నుంచి వచ్చే ఆర్థిక సాయాన్ని ఇక నుంచి నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ టెడ్రోస్ స్పందించారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను కట్టడి చేసి, ప్రజలను రక్షించటమే తమ ముందు ఉన్న ప్రధాన లక్ష్యమన్నారు. ఈ సమయంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయం విచారకరమని ట్విట్టర్ వేదికగా అభిప్రాయపడ్డారు.
ట్రంప్ నిధులను నిలిపివేయడం వల్ల భవిష్యత్ ఎదురయ్యే సమస్యలను సమీక్షిస్తున్నట్లు టెడ్రోస్ పేర్కొన్నారు. వైరస్‌పై పోరులో భాగస్వామ్య దేశాలతో కలిసి పని చేస్తున్నట్లు వివరించారు.
"ప్రస్తుతం సమయాన్ని వృథా చేయలేం. అందరితో కలిసి పనిచేస్తూ ప్రజల ప్రాణాలను కాపాడటం, కరోనా మహమ్మారిని అడ్డుకోవడంపైనే డబ్ల్యూహెచ్‌ఓ దృష్టి సారిస్తోంది. కొద్ది నెలలుగా కరోనాపై ఎంతో అధ్యయనం చేశాం. ముఖ్య విషయాలను నేర్చుకున్నాం. వైరస్ సోకిన వారిని గుర్తించటం, పరీక్షించటం, ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందించటం.. ఈ సూత్రం మాత్రమే ప్రజల ప్రాణాలను, ఆర్థిక వ్యవస్థలను కాపాడగలదు."
-టెడ్రోస్, డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్
కరోనా మహమ్మారి విషయంలో డబ్ల్యూహెచ్‌ఓ విఫలమైందని, ఆ సంస్థకు తమ నుంచి అందే నిధులు నిలిపివేస్తున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. అంతే కాకుండా డబ్ల్యూహెచ్‌ఓ కరోనాపై వాస్తవాలు దాచిపెట్టి చైనాకు అనుకూలంగా వ్యవహరించిందని ట్రంప్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌వో ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.