కరోనా... ఆరోగ్య అత్యవసర పరిస్థితికి దారితీస్తుందా? కరోనా వ్యాప్తి పట్ల ప్రపంచ దేశాలన్నీ అప్రమత్తంగా ఉండాలని, ఈ ప్రాణాంతక వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. కరోనా వ్యాప్తి చెందిన, చెందని దేశాలన్నీ ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది.
ఎమర్జెన్సీ
చైనాలో మొదలై ప్రపంచమంతా వ్యాపిస్తోన్న కరోనా వైరస్‌పై చర్చించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్.. నిపుణుల అత్యవసర సమావేశం చేపట్టాలని నిర్ణయించారు. కరోనా వ్యాప్తిని ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించాలా? వద్దా? అనే విషయాన్ని ఈ సమావేశంలో చర్చిస్తామని ఆయన స్పష్టం చేశారు.
రంగంలోకి చైనా సైన్యం
చైనాలో కరోనా బారిన పడి ఇప్పటివరకు 132 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ఆ దేశాధ్యక్షుడు షి జిన్‌పింగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా అరికట్టేందుకు మిలటరీ దళాలు సహకరించాలని ఆదేశించారు. ఫలితంగా చైనా సైన్యం... కరోనా వైరస్ వ్యాప్తికి కేంద్రంగా ఉన్న వుహాన్‌లో వేలాది మంది వైద్య సిబ్బందిని మోహరించింది.
చైనాలో ఇప్పటివరకు ఆరుగురు విదేశీయులు సహా 6,000 మందికి పైగా కరోనా సోకింది. చైనా నుంచి మరో 17 దేశాలకు కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందింది. ఈ నేపథ్యంలో ఈ మహమ్మారిని (కరోనా) అరికట్టేందుకు చైనా యుద్ధం చేస్తోందని జిన్‌పింగ్ ఇదివరకే వ్యాఖ్యానించారు.
ఇదీ చూడండి: లండన్ వర్సిటీల్లో 'మనోళ్లు' పెరిగారు