తెలంగాణ

telangana

ETV Bharat / international

వైట్‌హౌస్‌ ఉద్యోగికి కరోనా.. 3 రోజుల క్రితమే బైడెన్‌తో కలిసి... - శ్వేతసౌధంలో కరోనా

White House covid: శ్వేతసౌధంలో పనిచేసే ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. ఆ ఉద్యోగి మూడు రోజుల క్రితమే బైడెన్​తో కలిసి ప్రయాణించినట్లు శ్వేతసౌధ అధికార ప్రతినిధి వెల్లడించారు. దీంతో అప్రమత్తమై అధ్యక్షుడికి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు.

white house covid cases
white house covid cases

By

Published : Dec 21, 2021, 11:15 AM IST

White House covid: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో మరోసారి కరోనా కలకలం సృష్టించింది. అధ్యక్షుడు జో బైడెన్‌ పాలనా యంత్రాంగంలో ఓ ఉద్యోగికి వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. సదరు వ్యక్తి మూడు రోజుల క్రితం బైడెన్‌తో కలిసి ప్రయాణించినట్లు శ్వేతసౌధం అధికార ప్రతినిధి జెన్‌ సాకి ఓ ప్రకటనలో వెల్లడించారు.

Joe Biden Covid Test

"వైట్‌హౌస్‌లోని ఓ మధ్యస్థాయి ఉద్యోగికి సోమవారం ఉదయం కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆ ఉద్యోగి తరచూ అధ్యక్షుడికి కాంటాక్ట్‌లో ఉండరు. కానీ మూడు రోజుల క్రితం డిసెంబరు 17న అధ్యక్షుడు బైడెన్‌.. దక్షిణ కరోలినా నుంచి పెన్సుల్వేనియాలోని ఫిలడెల్ఫియాకు ప్రయాణించిన ఎయిర్‌ఫోర్స్‌ వన్‌లో ఆ ఉద్యోగి కూడా ఉన్నారు. ఆ సమయంలో సదరు ఉద్యోగి బైడెన్‌ వద్ద 30 నిమిషాలు ఉన్నారు."

-శ్వేతసౌధం

సదరు ఉద్యోగికి కొవిడ్ పాజిటివ్‌ అని తేలగానే అప్రమత్తమైన వైద్యులు.. బైడెన్‌కు ఆదివారం యాంటీజెన్‌, సోమవారం ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలు నిర్వహించారు. రెండింటిలోనూ ఆయనకు నెగెటివ్‌ వచ్చినట్లు వైట్‌హౌస్‌ ఆ ప్రకటనలో వెల్లడించింది. అధ్యక్షుడికి బుధవారం మరోసారి కరోనా పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది.

అయితే సీడీసీ మార్గదర్శకాల ప్రకారం.. రెండు డోసులు తీసుకున్న వ్యక్తులు కరోనా బాధితులతో కాంటాక్ట్‌ అయినప్పటికీ క్వారంటైన్‌లో ఉండాల్సిన అవసరం లేదని శ్వేతసౌధం ప్రతినిధి జెన్‌ సాకి తెలిపారు. అందువల్ల అధ్యక్షుడు తన రోజువారీ షెడ్యూల్‌ను కొనసాగిస్తారని వెల్లడించారు. శ్వేతసౌధంలోని సిబ్బంది ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్‌తో పాటు బూస్టర్‌ డోసులు కూడా తీసుకున్నట్లు ఆమె తెలిపారు. ఇదిలా ఉండగా.. అమెరికాలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ వణుకుపుట్టిస్తోంది. కేవలం వారం వ్యవధిలోనే అక్కడ కేసులు అమాంతం పెరిగిపోయాయి.

ఇదీ చదవండి:US Omicron death: అమెరికాలో తొలి ఒమిక్రాన్ మరణం

ABOUT THE AUTHOR

...view details