అధ్యక్షుడి రోజువారీ కార్యకలాపాల వివరాలను పొందేందుకు జో బైడెన్‌కు శ్వేతసౌధం అనుమతులు జారీ చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
అధ్యక్షుడికి ఉన్న ముప్పు, రక్షణ సంబంధిత విషయాలతో జాతీయ భద్రతా సంఘం ఈ వివరాలను పొందుపరుస్తుంది. ఎప్పటి నుంచి ఈ వివరాలు బైడెన్‌కు అందిస్తారన్న విషయంపై స్పష్టత లేదు. అయితే అధికార బదిలీలో ఇది మరో ముందడుగని సీఎన్ఎన్ వార్తా సంస్థ అభిప్రాయపడింది.
ఈ రహస్య సమాచారం అధ్యక్షుడితో పాటు భద్రతా సలహాదారులు, శ్వేతసౌధ ఉన్నతాధికారులు, నిఘా వర్గాలకు అందుబాటులో ఉంటుంది. దేశ భద్రతకు సంబంధించిన విషయాల్లో అధ్యక్షుడు త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవడానికి అవసరమైన వివరాలు ఇందులో ఉంటాయి.
బదిలీ ప్రక్రియను చేపట్టాలని జనరల్ సర్వీసెస్ అడ్మినిస్ట్రేషన్(జీఎస్ఏ)కు డొనాల్డ్ ట్రంప్ ఇదివరకే ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే తాజా ప్రకటన రావడం గమనార్హం.
ఇదీ చదవండి-బిన్ లాడెన్ ఎక్కడ దొరికాడో మరిచిపోయారా?