"ఈ సెప్టెంబర్ కల్లా క్లినికల్ ట్రయల్స్ ప్రారంభిస్తాం. వచ్చే ఏడాది ప్రారంభానికల్లా అత్యవసర కేసుల కోసం మొదటి విడత టీకాను తీసుకుని వస్తాం."... అమెరికాకు చెందిన దిగ్గజ సంస్థ... జాన్సన్ అండ్ జాన్సన్ చేసిన ఈ ప్రకటన ఇప్పుడు కరోనా కల్లోల ప్రపంచానికి ఓ ఆశాకిరణంగా కనిపిస్తోంది.
నిజానికి ఒక్క జాన్సన్ అండ్ జాన్సనే కాదు.. కరోనా రక్కసికి అడ్డుకట్టవేసేందుకు ప్రపంచ దేశాలన్నీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. కరోనా నిరోధక టీకా అందుబాటులోకి తెచ్చేందుకు వేల మంది నిపుణులు యుద్ధ ప్రాతిపదికన పరిశోధనలు జరుపుతున్నారు. అయితే వీటన్నింటికీ సంబంధించిన పూర్తిస్థాయి ఫలితాలు రావటానికి మాత్రం మరికొంచెం సమయం వేచి చూడక తప్పదు.
వివిధ దశల్లో..
ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం దాదాపు 20కి పైగా వ్యాక్సిన్ అభివృద్ధి పరిశోధనలు జరుగుతున్నాయి. వీటిల్లో కొన్ని ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయి. ప్రస్తుతం ఆ వ్యాక్సిన్‌లను జంతువులపై ప్రయోగింస్తున్నారు. మరి కొన్ని వ్యాక్సిన్‌లైతే ఈ దశను పూర్తి చేసుకొని మనుషులపై ప్రయోగాలకు సిద్ధంగా ఉన్నాయి. అమెరికాలో అభివృద్ధి చేసిన టీకాను ఇటీవల ఓ మహిళపై ప్రయోగించారు. ఫలితం కోసం శాస్త్రవేత్తలు, ప్రపంచ దేశాలు ఉత్కంఠగా వేచిచూస్తున్నాయి.
కరోనాకు టీకాను కనుక్కునేందుకు అమెరికా, రష్యాలు పోటీ పడుతున్నాయి. ఈ ఏడాది చివరినాటికి లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో దీన్ని అందుబాటులోకి తేవాలని, అందుకు అనుగుణంగా పరిశోధనలు వేగంగా జరపాలని తమ దేశ శాస్త్రవేత్తలకు సూచించాయి.
ఏడాదిన్నర సమయం..
అన్నీ అనుకూలిస్తే, ఈ ఏడాది చివర్లో కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ టీకాలు కనుక్కోగలిగినా, దాన్ని విస్తృతంగా అభివృద్ధి పరిచేందుకు మరింత శ్రమ, కష్ట తప్పవని శాస్త్రవేత్తలు అంటున్నారు. అంటే, కరోనాను నిరోధించే పూర్తిస్థాయి వ్యాక్సిన్ వెలుగులోకి రావడానికి కనీసం ఏడాదిన్నర సమయం పట్టవచ్చని వారు అంచనా వేస్తున్నారు.
ఇక్కడ మరొక విషయం కూడా చాలా కీలకంగా ఉంది. వ్యాక్సిన్ కనుగొన్నా అది ఇప్పుడిప్పుడే అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. పరిశోధనలు ఫలించి, కరోనా నిరోధక టీకా అందుబాటులోకి వచ్చినా... దాని సరఫరా మాత్రం చాలా అరుదుగా ఉంటుందని పరిశోధకులు చెపుతున్నారు.