తెలంగాణ

telangana

ETV Bharat / international

ఫలితాలు వచ్చేశాయ్.. కానీ అంతా అయిపోలేదు! - how us elections are conducted

అమెరికా అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ ఎంతో సంక్లిష్టంగా ఉంటుంది. ప్రైమరీ ఎన్నికల పేరుతో అభ్యర్థులను ఖరారు చేయడం నుంచి.. ఓటింగ్ జరిగే వరకు ఎంతో సుదీర్ఘంగా సాగుతుంది. అయితే ఫలితాలు వెల్లడైన తర్వాత అంతా పూర్తయినట్లు కాదు. ఎలక్టార్లు అధ్యక్షుడిని ఎన్నుకొనే ప్రక్రియ మిగిలే ఉంది.

What's next? Saturday's election verdict isn't last step
http://10.10.50.85//karnataka/08-November-2020/kn-srs-01-gomamsa-vis-ka10005_08112020172358_0811f_1604836438_545.jpg

By

Published : Nov 8, 2020, 5:46 PM IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. తదుపరి అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికయ్యారు. అయితే ఎన్నికల ప్రక్రియ పూర్తయిందా? అంటే లేదు. అమెరికా అధ్యక్షుడిని ఎన్నుకోవడంలో ఈ ఫలితం ఒక్కటే చివరి దశ కాదు. 538 మంది ఎలక్టార్లు అధ్యక్షుడిని ఎన్నుకొనే ప్రక్రియ ఇంకా మిగిలి ఉంది.

ఇవే కీలక దశలు:

*అమెరికా ప్రజలు అధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకుంటున్నారంటే నిజానికి వారు అధ్యక్షుడికి నేరుగా ఓటేసినట్లు కాదు. ముందుగా తమ రాష్ట్రంలోని ఎలక్టార్లను ఎన్నుకుంటారు. వీరంతా అధ్యక్షుడిని ఎన్నుకొంటారు. దాదాపు తమ పార్టీ అభ్యర్థికే వీరు ఓట్లేస్తారు.

మొత్తం ఎలక్టార్ల సంఖ్య రాష్ట్రాలలోని మొత్తం ఎలక్టోరల్​ ఓట్లకు సమానంగా ఉంటుంది. ఎలక్టార్లను ఎన్నుకునే విధానంపై ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంటుంది. సాధారణంగా ప్రతి ఎలక్టోరల్ అభ్యర్థిని రాష్ట్ర పార్టీ కన్వెన్షన్​లో ఎన్నుకుంటారు. ఒక్కోసారి పార్టీ సెంట్రల్ కమిటీ ద్వారా ఎంపిక చేస్తారు.

* ఎన్నికల తర్వాత రాష్ట్రాలు ఓట్లను లెక్కిస్తాయి. ఎవరికి ఎన్ని పాపులర్ ఓట్లు వచ్చాయో నిర్ణయిస్తాయి. ఇది పూర్తయిన తర్వాత.. ప్రతి గవర్నర్ 'నిర్ధరణ పత్రాలు' సమర్పించాల్సి ఉంటుంది. ఈ పత్రాల్లో ఎలక్టార్ల పేర్లు, వారికి వచ్చిన ఓట్ల సంఖ్య, విజేత, పరాజిత పేర్లను పేర్కొంటారు. రాష్ట్ర అధికారిక చిహ్నం ముద్రించిన ఈ పత్రాలను ప్రభుత్వ సమాచారాన్ని భద్రపరిచే 'నేషనల్ ఆర్కైవ్స్​ అండ్ రికార్డ్స్ అడ్మినిస్ట్రేషన్'​కు పంపిస్తారు.

డిసెంబర్ 8

రాష్ట్ర స్థాయిలో ఎన్నికల్లో తలెత్తిన వివాదాలు పరిష్కరించేందుకు డిసెంబర్ 8 వరకు గడువు ఇస్తారు. ఈ తేదీలోపు రీకౌంటింగ్​లు, ఏదైనా ఇతర వివాదాలను పూర్తి చేయాల్సి ఉంటుంది.

డిసెంబర్ 14:

పేపర్ బ్యాలెట్ ద్వారా ఎలక్టార్లు అధ్యక్షుడికి ఓట్లేస్తారు. ఎక్కువ పాపులర్​ ఓట్లు ఎవరికి వస్తే వారికే ఎలక్టార్లు ఓటేయాలని వాషింగ్టన్ డీసీ సహా ముప్పై మూడు రాష్ట్రాల్లో నిబంధన ఉంది.

అధ్యక్షుడికి, ఉపాధ్యక్షుడికి వచ్చిన ఓట్లను లెక్కిస్తారు. ఆరు 'సర్టిఫికేట్ ఆఫ్ ఓట్​'పై ఎలక్టార్లు సంతకాలు చేస్తారు. ఇతర ధ్రువపత్రాలతో పాటు ఈ సర్టిఫికేట్​ను మెయిల్ ద్వారా సెనేట్ అధ్యక్షుడికి, అధికారులకు పంపిస్తారు.

డిసెంబర్ 23:

'సర్టిఫికేట్ ఆఫ్ ఓట్' సహా ఇతర పత్రాలను నియమించిన అధికారులకు తప్పక పంపించాలి. ఈ సర్టిఫికేట్లు అధికారులకు చేరకపోతే... ఫలితాలను వాషింగ్టన్​కు చేరవేసేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు ఉంటాయి.

2021, జనవరి 6:

ఎలక్టోరల్ ఓట్లను లెక్కించేందుకు అమెరికా ఉభయ సభలు సంయుక్త సమావేశం నిర్వహిస్తాయి. సెనేట్ అధ్యక్షుడు(అమెరికా ఉపాధ్యక్షుడే సెనేట్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు) ఫలితాలను ప్రకటిస్తారు. ఏదైనా అభ్యర్థికి 270 ఓట్లకన్నా ఎక్కువ వస్తే వారిని విజేతగా నిర్ణయిస్తారు.

అయితే ఈ ఫలితాలపై కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేయవచ్చు. లిఖిత పూర్వకంగానే అభ్యంతరాలను తెలపాల్సి ఉంటుంది. దీనికి సెనేట్​లో ఒకరు, ప్రతినిధుల సభ నుంచి ఒకరి మద్దతివ్వాలి.

ఒకవేళ అభ్యంతరాలు సమంజసమని తేలితే.. రెండు సభలు వేర్వేరుగా వీటిపై చర్చిస్తాయి. ఒక్కో అభ్యంతరంపై గరిష్ఠంగా రెండు గంటల పాటు చర్చలు జరుపుతాయి. తర్వాత సంయుక్త సమావేశం నిర్వహించి అభ్యంతరాలపై నిర్వహించిన ఓటింగ్ ఫలితాలు వెల్లడిస్తాయి.

ఏదైనా రాష్ట్రంలో ఎలక్టోరల్ ఓట్లలో అవకతవకలు ఉండి.. వాటిని ఓటింగ్​ నుంచి మినహాయించాలంటే అందుకు ఉభయ సభల అనుమతి తప్పనిసరి.

ఒకవేళ ఏ అభ్యర్థీ 270 ఎలక్టోరల్ ఓట్లను సాధించలేకపోతే రాజ్యాంగంలోని 12వ సవరణ ప్రకారం అధ్యక్షుడిని కాంగ్రెస్ ఎన్నుకుంటుంది. అవసరమైతే మెజారిటీ ఓటింగ్ ఆధారంగా ఎన్నిక చేపడుతుంది.

2020, జనవరి 20:

అధ్యక్షుడిగా ఎన్నికైన అభ్యర్థి ప్రమాణస్వీకారం చేస్తారు.

ప్రమాణస్వీకారంతో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థి బాధ్యతలు స్వీకరిస్తారు. దీంతో అగ్రరాజ్యంలో ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది.

ఇదీ చదవండి-ఓడింది ట్రంప్​ మాత్రమే.. 'ట్రంపిజం' కాదు!

ABOUT THE AUTHOR

...view details