ప్రపంచస్థాయి నేతలు, సెలబ్రిటీలు, టెక్ రారాజుల ట్విట్టర్ ఖాతాలను హ్యాక్ చేశారు సైబర్ నేరగాళ్లు. బుధవారం ఈ ఘటన జరగ్గా.. నెట్టింట విపరీతంగా చర్చనీయాంశమైంది. కోట్ల మంది ప్రజలు కమ్యూనికేషన్ కోసం ఇదే మాధ్యమాన్ని ఉపయోగిస్తుండటం వల్ల యూజర్ డేటా భద్రతపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. క్రిప్టోకరెన్సీ స్కాం ముఠానే ఈ దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ముందు ట్విట్టర్లో భద్రతా లోపాలను ఇది బహిర్గతం చేస్తోంది. ఎన్నికల్లో జోక్యం చేసుకోవడం, తప్పుడు సమాచార వ్యాప్తి జరిగే అవకాశం ఉందనే వాదనలను ఈ ఘటన మరింత బలపరుస్తోంది. ఈ నేపథ్యంలో పలు ప్రశ్నలు-వాటి సమాధానాలు చూద్దాం.
ఎలా జరిగింది?
జులై 15 మధ్యాహ్నం ట్విట్టర్‌కు ఊహించని షాక్ తగిలింది. అంతర్జాతీయ ప్రముఖులు, సంపన్నులు, వ్యాపారవేత్తలు లక్ష్యంగా హ్యాకర్లు ట్విట్టర్ ఖాతాలపై దాడి చేశారు. ఇందులో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, జో బైడెన్, బిల్‌గేట్స్, వారెన్‌బఫెట్, అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్, ఎలాన్ మస్క్ సహా సెలబ్రిటీలు కేన్ వెస్ట్, అతడి భార్య కిమ్ కర్దాషియన్ వంటివారు ఉన్నారు. వీరి అధికారిక ఖాతాలలో అనుమానాస్పద ట్వీట్లు పెట్టారు సైబర్ కేటుగాళ్లు. క్రిప్టో కరెన్సీ రూపంలో తమకు డొనేషన్లు కావాలని తర్వాత రెట్టింపు చెల్లిస్తామని సైబర్ నేరగాళ్లు మెసేజ్‌లు పెట్టినట్లు ట్విట్టర్ గుర్తించింది.
ఈ ఘటన దెబ్బకు యాపిల్, ఉబర్ సంస్థలను ఫాలో అయ్యే 56 లక్షల అకౌంట్లు ఇబ్బందుల్లో పడినట్లు నిపుణులు అంచనా వేశారు.
ట్విట్టర్ ధ్రువీకరణ..
ప్రముఖుల ఖాతాలు హ్యాక్ అయిన విషయాన్ని ట్విట్టర్ సపోర్ట్ టీం అధికారికంగా ధ్రువీకరించింది. సెలబ్రిటీల ఖాతాలు హ్యాకర్ల బారినపడినట్లు గుర్తించిన వెంటనే వాటిని దిద్దుబాటు చర్యలు చేపట్టామని వెల్లడించింది. ఆయా ట్వీట్‌లను డిలీట్ చేసి.. తాత్కాలికంగా ఆ ఖాతాలను నిలిపివేసినట్లు పేర్కొంది. ముఖ్యంగా వెరిఫైడ్ ఖాతాలే లక్ష్యంగా హ్యాకర్లు ఈ దాడికి పాల్పడ్డారని.. ఈ వ్యవహారంపై పూర్తి విచారణ జరపడమే కాకుండా భద్రతా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు ట్విట్టర్ బృందం ప్రకటించింది.
ఈ దాడిని 'కో-ఆర్డినేటెడ్ సోషల్ ఇంజినీరింగ్ ఎటాక్'గా ట్విట్టర్ అభివర్ణించింది. సంస్థలోని సిబ్బందిని టార్గెట్ చేసి అంతర్గత సిస్టమ్‌ను, టూల్స్‌ను యాక్సెస్ చేసేందుకు పన్నాగాలు పన్నారని.. అయితే అవి సఫలం కాలేదని ట్విట్టర్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఘటన తర్వాత అమెరికాలోని రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు, జర్నలిస్టులు, వార్తా సంస్థలకు చెందిన అధికారిక గ్రూప్‌లను తాత్కాలికంగా నిలిపివేశారు.
సోషల్ ఇంజినీరింగ్ అంటే ఏంటి?
మానవ స్వభావాన్ని ఆసరాగా చేసుకుని, అనుకున్న లక్ష్యాన్ని సాధించడాన్ని సోషల్ ఇంజినీరింగ్ అంటారు. ఉదాహరణకు ఫిషింగ్ దాడులకు పాల్పడటం, ఆకర్షించే సమాచారం ఎరవేయడం, హానికరమైన సాఫ్ట్వేర్లను డౌన్లోడ్ చేయించడం ద్వారా మాల్వేర్ ఎటాక్‌లు చేయడం, సమాచారానికి బదులుగా డబ్బు ఇస్తామని ఆశపెట్టడం వంటి పనులు చేస్తారు సైబర్ కేటుగాళ్లు. సంస్థల ఉద్యోగులను ప్రలోభపెట్టి అంతర్గత డేటాను సేకరించే ప్రయత్నాలు చేస్తారు.
దాడులను నియంత్రించగలిగారా?
ట్విట్టర్ అంతర్గత సిస్టమ్‌లు, టూల్స్‌ను యాక్సెస్ చేయడానికి కొందరు సిబ్బందికి మాత్రమే అనుమతి ఇచ్చేలా మార్పులు చేసినట్లు సంస్థ తెలిపింది. గతంలోనూ ఇలాంటి దాడులు జరిగాయి. వాటికి సిబ్బంది కారణంగా గుర్తించారు. 2017లో ఓ ఉద్యోగి అమెరికా అధ్యక్షుడి ట్విట్టర్ ఖాతాను కొద్ది నిమిషాల పాటు నిలిపివేశాడు. మరో ఇద్దరు మాజీ సిబ్బంది సౌదీ అరేబియా ప్రభుత్వం కోసం నిఘా కార్యకలాపాలు సాగించినట్లు గుర్తించారు.
2020 ఎన్నికలపై ఏదైనా ప్రభావం ఉంటుందా?
ఈ ఏడాది అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఉన్నాయి. ఇప్పటికే ట్రంప్ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఈ ఎన్నికల్లో సోషల్ మీడియా కీలకపాత్ర పోషించనుంది. గతంలోనూ ట్రంప్ ఫేస్బుక్లో అక్రమ మార్గాల్లో ఓటర్ల ఆలోచనల్ని ప్రభావితం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. తాజా ఘటనలో డెమొక్రాట్ల అకౌంట్లు ఎక్కువగా హ్యాకయ్యాయి. రిపబ్లికన్ ట్రంప్ అకౌంట్ సురక్షితంగా ఉందని, దానికి ఎలాంటి ప్రమాదం లేదని అధికారులు స్పష్టం చేశారు.
2016 అమెరికా ఎన్నికలకు ముందు రష్యా ఇలాంటి దాడులకు పాల్పడి సోషల్ మీడియాను తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని ప్రయత్నించిందని అమెరికా గతంలో ఆరోపించింది. ప్రచారాలు, ప్రముఖ పార్టీ కార్యాలయాలపై రష్యా అప్పట్లో దృష్టి పెట్టినట్లు పేర్కొనడం చర్చనీయాంశమైంది. ఆ తర్వాత ట్విట్టర్, ఫేస్బుక్, ఇతర సామాజిక మాధ్యమాలు తమ విధివిధానాలను మార్చుకున్నట్లు స్పష్టం చేశాయి. ఎలాంటి సెక్యూరిటీ సిస్టమ్‌లు, రహస్య వ్యక్తులు చొరబడకుండా భద్రతను పటిష్ఠం చేసుకున్నట్లు పేర్కొన్నాయి. అయితే తాజా క్రిప్టోకరెన్సీ దాడితో భద్రతలో డొల్లతనం బయటపడింది. ఫలితంగా ఈసారైనా అమెరికా ఎన్నికలు సవ్యంగా, పాదర్శకంగా జరుగుతాయా? అని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అతిపెద్ద హ్యాకింగ్...!
బిట్‌కాయిన్ ఆశచూపి స్కామ్ చేసే ఘటనలు సాధారణంగా జరుగుతూనే ఉంటాయి. 2017లో ఇలాంటి భారీ హ్యాక్ జరిగినప్పటికీ అది కొన్ని సంస్థల ఖాతాలపైనే జరిగింది. కానీ, ఈసారి ప్రపంచకుబేరులు, ప్రముఖుల అధికారిక ఖాతాలపై దాడిచేయడం అనూహ్య పరిణామమని సైబర్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లోనే అతిపెద్ద హ్యాకింగ్‌లలో దీనిని కూడా ఒకటిగా పేర్కొన్నారు.