తెలంగాణ

telangana

By

Published : Nov 8, 2021, 10:51 AM IST

ETV Bharat / international

అమెరికా వెళ్లాలనుకుంటున్నారా? ఈ రూల్స్ ఫాలో అవ్వాల్సిందే!

అమెరికా వెళ్లాలనుకునే వారి ఆశలకు కొవిడ్ అడ్డుపడింది. ఏడాదిన్నరగా ఆ దేశం అంతర్జాతీయ ప్రయాణికులపై ఆంక్షలు విధించింది. ఇప్పడు ఆ నిబంధనలను ఎత్తివేస్తూ.. సోమవారం నుంచి ప్రయాణికుల రాకపోకలను అనుమతిస్తున్నట్లు ప్రకటించింది. మరి ఎవరెవరు అమెరికా వెళ్లేందుకు అర్హులు? అమెరికా(America International Travel Restrictions) వెళ్లాలంటే ముందు ఏమేం చేయాలి?

U.S. international air travel rules
అమెరికా అంతర్జాతీయ ప్రయాణ నిబంధనలు

కొవిడ్‌ కారణంగా అగ్రరాజ్యం గత ఏడాదిన్నరగా అంతర్జాతీయ ప్రయాణికులపై విధించిన నిబంధనల్ని(America International Travel Restrictions) ఎత్తేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆమోదం పొందిన టీకాలు వేసుకున్న ప్రయాణికుల రాకపోకల్ని సోమవారం నుంచి అనుమతిస్తున్నట్టు ప్రకటించింది. దీంతో భారత్‌ సహా బ్రెజిల్, చైనా, దక్షిణాఫ్రికా, బ్రిటన్, ఇతర ఐరోపా దేశాల నుంచి అక్కడికి రాకపోకలు పెరగనున్నాయి. అలాగే అగ్రరాజ్యం తన భౌగోళిక సరిహద్దులను పూర్తిస్థాయిలో తెరుస్తుండటం వల్ల పొరుగు దేశాలైన కెనడా, మెక్సికోల నుంచి రోడ్డు రవాణా సైతం ఊపందుకోనుంది. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు(America International Travel Restrictions) వ్యక్తమయ్యే కొన్ని సందేహాలు(New Us Rravel Rules).. వాటికి సమాధానాలివి..

ఇప్పుడెందుకు నిబంధనలు తొలగించారు?

కొవిడ్‌-19 వ్యాప్తికి అడ్డుకట్ట వేస్తూనే.. సాధారణ ప్రయాణాలను పునరుద్ధరించడం లక్ష్యమని అమెరికా చెబుతోంది. ఇప్పటికే ఐరోపా దేశాలు అంతర్జాతీయ ప్రయాణాలపై విధించిన నిషేధాలను ఎత్తేశాయి. అమెరికన్లను గత కొన్ని నెలలుగా తమ భూభాగంలోకి అనుమతిస్తున్నాయి. అలాగే అమెరికా కూడా తన విధానాలు మార్చుకోవాలని ఆయా దేశాలన్నీ ఒత్తిడి చేశాయి.

వెళ్లేందుకు ఏ అర్హతలు ఉండాలి?

అమెరికా వెళ్లే విమానం ఎక్కేముందే విదేశీ పౌరులకు వ్యాక్సినేషన్‌ పూర్తయి ఉండాలి. ప్రయాణానికి ముందు 72 గంటల్లోపు చేయించుకున్న కొవిడ్‌ పరీక్ష 'నెగెటివ్‌' రిపోర్టును చూపించాల్సి ఉంటుంది.

ప్రతిఒక్కరూ టీకాలు వేసుకొని ఉండాల్సిందేనా?

అవును.. అయితే కొన్ని మినహాయింపులున్నాయి. 18 ఏళ్ల లోపు వారు టీకాలు తీసుకొని ఉండాల్సిన అవసరం లేదు. అయితే వీరు కూడా కొవిడ్‌ పరీక్ష చేసుకోవాలి. రెండేళ్లు, అంతకంటే చిన్న పిల్లలకు పరీక్ష అవసరం లేదు.

టీకా వేయించుకోని పెద్దల పరిస్థితి ఏమిటి?

ప్రపంచంలో దాదాపు సగం దేశాల్లో టీకా కొరత నేటికీ తీవ్రంగానే ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని బైడెన్‌ ప్రభుత్వం కొన్ని వెసులుబాట్లు ఇస్తోంది. జనాభాలో 10% కంటే తక్కువ వ్యాక్సినేషన్‌ జరిగిన 50 దేశాల జాబితా రూపొందించింది. ఆయా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు ముందుగానే అనుమతి తీసుకోవాలి. అలాంటి వారిలో అత్యవసర వైద్యం, మానవీయ కోణంలో అవసరం ఉన్నవారినే అనుమతిస్తారు.

వచ్చేవారు అమెరికన్లు అయితే ఏం చేయాలి?

టీకా వేయించుకోని అమెరికన్లు ప్రయాణానికి ముందు ఒక రోజు వ్యవధిలో చేయించిన కొవిడ్‌ పరీక్ష నెగెటివ్‌ రిపోర్టు చూపించాలి. టీకా వేసుకొన్న అమెరికన్లు అయితే ప్రయాణానికి ముందు మూడు రోజుల్లోపు చేయించిన పరీక్ష రిపోర్టు చూపాలి. (అమెరికాలో అంతర్గతంగా తిరిగే విమాన ప్రయాణాలకు ఇది వర్తించదు)

ఈ టీకా నియమాలన్నీ ఎవరు అమలు చేస్తారు?

విమానయాన సంస్థలే.. ప్రయాణికుల ధ్రువీకరణ పత్రాలన్నీ పరిశీలించాకే ప్రయాణాలకు అనుమతించాలి. నిబంధనలు ఉల్లంఘించే సంస్థలకు 35 వేల డాలర్ల వరకు జరిమానా విధిస్తారు. అమెరికా సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) ఉద్యోగులు ప్రయాణికుల్ని తనిఖీ చేస్తారు కూడా.

మెక్సికో, కెనడాల నుంచి రోడ్డు మార్గంలో లేదా ఓడలో అమెరికా వెళ్లాలనుకుంటే..?

రోడ్డు/జల మార్గంలో వచ్చినా.. టీకా వేసుకునే ఉండాలి. అందుకు తగిన ఆధారాన్ని సరిహద్దు రక్షణ సిబ్బంది, కస్టమ్స్‌ అధికారులకు చూపాలి. పిల్లలకు మినహాయింపు ఉంటుంది.

ఏ టీకాలు వేసుకుని ఉండాలి?

ముందే చెప్పినట్టు డబ్ల్యూహెచ్‌వో అనుమతి పొందిన టీకాలు ఏవి వేసుకున్నా సరిపోతుంది. అమెరికా టీకాలైన ఫైజర్, మోడెర్నా, జాన్సన్‌లతో పాటు లండన్‌ తయారీ అస్ట్రాజెనెకా, చైనా తయారీ సినోవాక్, భారత్‌లో తయారయ్యే కొవాగ్జిన్‌లలో ఏది తీసుకున్నా సరిపోతుంది. అయతే రష్యా తయారుచేసిన ‘స్పుత్నిక్‌ వి’ టీకాకు మాత్రం డబ్ల్యూహెచ్‌వో ఆమోదం ఇంకా రాలేదు.

ఎవరెవరి ప్రయాణాలకు ఇబ్బందులు ఉండొచ్చు?

అంతర్జాతీయ ప్రయాణాలను పునరుద్ధరిస్తున్నందున.. ఇదివరకే సాంకేతికంగా అమెరికా వచ్చేందుకు అనుమతి పొందిన వారిలో ఎవరైనా టీకా వేసుకోనివారుంటే ఇప్పుడు వారి పేర్లు బ్లాక్‌ అవుతాయి. అదీగాక సాధారణ ప్రయాణాలకు వీలుగా వీసాలు జారీ చేయడంలో విపరీతమైన ఆలస్యం జరగొచ్చు. అలాగే ఇతర దేశాల నుంచి వ్యాపారం, పర్యాటకం కోసం అమెరికా వెళ్లే వారికీ ఇబ్బందులు తలెత్తవచ్చు.

ఇదీ చూడండి:ప్రత్యేక వృత్తిగా ఆ ఉద్యోగం- హెచ్​1బీ వీసా కంపెనీలు హ్యాపీ

ఇదీ చూడండి:అమెరికా ప్రయాణికులకు అలర్ట్.. కొత్త ట్రావెల్ రూల్స్ ఇవే

ABOUT THE AUTHOR

...view details