అమెరికాలో ఎన్నికల ఫలితాలపై కోర్టుకెళ్లటం మామూలే! అయితే అది స్థానిక కోర్టుల నుంచి మొదలై.. రాష్ట్రస్థాయి, చివరికి సుప్రీందాకా చేరుతుంది. చాలా కేసులు స్థానికంగానే తేలిపోతాయి. కానీ ఈసారి అధ్యక్షుడు ట్రంప్ ఏకంగా సుప్రీంకోర్టులోనే వీటిపై కేసు వేయటానికి సిద్ధమవటానికి కారణం లేకపోలేదు.
చాలా రాష్ట్రాల్లో భారీస్థాయిలో పోస్టల్/ముందస్తు ఓట్లు నమోదయ్యాయి. పైగా స్థానిక నిబంధనల ప్రకారం- కొన్ని రాష్ట్రాల్లో మంగళవారం నాటి ఓటింగ్ పూర్తయ్యాక కూడా ఓట్లను స్వీకరించటానికి అవకాశం ఉంది. దీనివల్ల అవకతవకలకు ఆస్కారం ఉందని... వాటిని ఆపేయాలని రిపబ్లికన్ పార్టీ ముందు నుంచి కోరుతోంది. ముఖ్యంగా డెమొక్రాట్లు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇలాంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేది ఆరోపణ.
భారీగా వస్తోన్న ఓట్లు..
తాజాగా పెన్సిల్వేనియాలో మంగళవారం తర్వాత ఓట్లు భారీగా వచ్చి చేరుతున్నాయని.. కొన్ని జిల్లాల్లో పోస్టల్ ఓట్లను వేసిన తర్వాత మార్పులు చేర్పులకు అవకాశం ఇస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఫలితం తేలకుండా మిగిలిన కీలక రాష్ట్రాల్లో పెన్సిల్వేనియాలో అత్యధికంగా 20 ఎలక్టోరల్ ఓట్లున్నాయి. అక్కడ ప్రస్తుతం ట్రంప్ భారీ మెజార్టీతో ఉన్నారు. కానీ ఇంకా 10 లక్షలకుపైగా పోస్టల్ ఓట్లు లెక్కించాల్సి ఉందని.. భారీ మెజార్టీకి అవకాశమున్న ఈ ఓట్లను జాగ్రత్తగా తొందరపడకుండా లెక్కిస్తామని అక్కడి గవర్నర్ (డెమొక్రాట్) స్పష్టం చేశారు. ఈ పోస్టల్ లెక్కింపు ఫలితాన్ని తారు మారు చేస్తుందేమోననేది ట్రంప్ వర్గం ఆందోళన!
ఆశాకిరణం..
ఆయా రాష్ట్రాల్లోని కోర్టులకు వెళితే ఆలస్యమై... గందరగోళానికి దారితీసే అవకాశం ఉంది. అందుకే నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించి ఈ ఓట్లపై, లెక్కింపుపై అనుకూల తీర్పు తెచ్చుకోవాలనేది ట్రంప్ వర్గం ఆలోచన. ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో ఓటింగ్ తేదీ తర్వాత పోస్టల్ ఓట్లను అంగీకరించాలన్న విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. అది కూడా రిపబ్లికన్‌లకు ఓ ఆశాకిరణంలా కనిపిస్తోంది. దీనికి తోడు 2000 సంవత్సరంలో జార్జ్‌బుష్ జూనియర్ ఎన్నిక కూడా ఇలాగే నువ్వానేనా అన్నట్లు సాగి చివరకు సుప్రీంకోర్టులో తేలింది. అక్కడ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి బుష్‌నే విజయం వరించింది.
బుష్ కేసులో ఏమైందంటే...
2000 సంవత్సరం అధ్యక్ష ఎన్నికల్లో... అల్ గోర్ (డెమొక్రటిక్), జార్జ్ బుష్ (రిపబ్లికన్)ల మధ్య ఫ్లోరిడా ఫలితాలపై పీటముడి పడింది. తొలుత లభించిన ఆధిక్యాలతో బుష్‌ను విజేతగా భావించారు. కానీ కౌంటింగ్ కొనసాగిన కొద్దీ బుష్ ఆధిక్యం గణనీయంగా తగ్గటం వల్ల గోర్ ఫ్లోరిడాలోని అన్ని ప్రాంతాల ఓట్లను మళ్ళీ లెక్కించాలని డిమాండ్ చేశారు. ఆ క్రమంలో రెండు పార్టీలూ కోర్టులకెక్కాయి. నవంబరు 3న పోలింగైతే.. డిసెంబరు 12 దాకా ఫలితం తేలలేదు.
చివరకు అమెరికా సుప్రీంకోర్టు ఫ్లోరిడాలో కౌటింగ్‌ను నిలిపేసింది. దీంతో బుష్ అధ్యక్షుడయ్యారు. ఈసారి కూడా.. ఇలాగే సుప్రీంకోర్టును ఆశ్రయించాలన్నది ట్రంప్ వర్గం భావన. ఎందుకంటే నాటి ఫ్లోరిడా లాంటి సందర్భాలు ఈసారి చాలా రాష్ట్రాల్లో ఉన్నాయని రిపబ్లికన్‌లు ఆరోపిస్తున్నారు.
పోస్టల్ బ్యాలెట్ల అర్హతలపై వివిధ రాష్ట్రాల్లో విడివిడిగా కేసులు వేసేకంటే... సుప్రీంలో వేసి, తీర్పు అనుకూలంగా వస్తే అందరికీ వర్తిస్తుందని, ఫలితంగా తమ పని సులభమవుతుందని అంచనా! ఇటీవలే సుప్రీంకోర్టులో ట్రంప్ నియమించిన న్యాయమూర్తి చేరారు కాబట్టి.. తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని ఇలా చేస్తున్నారని ఆరోపించేవారు కూడా లేకపోలేదు. ట్రంప్ సుప్రీంకోర్టుకెళితే కోర్టు ఎలా స్పందిస్తున్నది ఆసక్తికరం!
ఇదీ చూడండి:6 అడుగుల దూరంలో బైడెన్- న్యాయపోరాటానికి ట్రంప్