1971 డిసెంబర్ 21 నుంచి 'భారత్-పాకిస్థాన్ అంశం' ఐక్యరాజ్యసమితిలో నిర్జీవంగా ఉంది. అయితే 2019 ఆగస్టు 16న ఈ వ్యవహారానికి మరోమారు ప్రాణం పోసింది చైనా. భారత్-పాక్ అంశంపై అంతర్గత చర్చ జరపాలని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో(యూఎన్ఎస్సీ) ప్రతిపాదించి ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురిచేసింది. కానీ, డ్రాగన్ దేశం ప్రతిపాదనకు మండలిలోని 14 మంది సభ్యుల్లో ఒక్కరు కూడా మద్దతుగా నిలవకపోవడం గమనార్హం. అయితే దాదాపు ఐదు దశాబ్దాలుగా చర్చకు రాని భారత్-పాక్ అంశంపై ఇప్పుడు గళం విప్పడం వెనుక చైనా ఆలోచన ఏంటన్నది ప్రశ్నార్థకం.
భారత్ ఫిర్యాదును వక్రీకరించిన బ్రిటన్
తమ భూభాగమైన జమ్ముకశ్మీర్లో పాక్ సైన్యం కవ్వింపు చర్యలకు పాల్పడుతుండటంపై 1948 జనవరి 1న ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి ఫిర్యాదు చేసింది భారత్. అయితే అప్పటికే యూఎన్ఎస్సీలో శాశ్వత సభ్యదేశంగా ఉన్న బ్రిటన్... భారత ఫిర్యాదును 'భారత్-పాక్ అంశం'గా వక్రీకరించింది. అదే సమయంలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్ సభ్య దేశంగా లేకపోవడం వల్ల.. 'రెండు దేశాల సిద్ధాంతాన్ని' జమ్ముకశ్మీర్లో అమలు చేయాలన్న బ్రిటన్ వాదనకు దారులు తెరుచుకున్నాయి.
గతంలో క్రియాశీలక చర్చలకు దూరంగా చైనా
రిపబ్లిక్ ఆఫ్ చైనా 1945 జూన్ 26 నుంచి 1971 అక్టోబర్ 25 వరకు యూఎన్ఎస్సీలో స్వీయ-ఎంపిక శాశ్వత సభ్య దేశంగా ఉంది. అదే సమయంలో భారత్-పాక్ అంశంపై దాదాపు 17 తీర్మానాలను ప్రవేశపెట్టింది ఐక్యరాజ్యసమితి భద్రతామండలి. అయితే వీటిలో ఏ ఒక్క తీర్మానంలోనూ చైనా క్రియాశీలకంగా పాల్గొనలేదు. 1971 అక్టోబర్ 25న రిపబ్లిక్ ఆఫ్ చైనా సభ్యత్వాన్ని ఐక్యరాజ్య సమితిలో రద్దు చేస్తూ.. ఆ స్థానాన్ని పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాకు అప్పగించింది. ఈ ప్రతిపాదనను అనుకూలంగా ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఇందుకు మొత్తం 128 దేశాల్లో 76 దేశాలు మద్దతుగా నిలిచాయి. అందులో భారత్ కూడా ఒకటి.
కానీ, 1971 భారత్-పాక్ యుద్ధ సమయంలో యూఎన్ఎస్సీలో భారత్-పాక్ అంశంపై పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా క్రియాశీలకంగా వ్యవహరించింది. 1971 డిసెంబర్లో బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం పొందడంలో భారత్ దూకుడును తీవ్రంగా విమర్శించింది. అలాగే ఐక్యరాజ్య సమితిలో స్వతంత్ర బంగ్లాదేశ్ సభ్యత్వానికి వ్యతిరేకం తెలుపుతూ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా తన తొలి ఓటును వినియోగించుకుంది.
కశ్మీర్ భూభాగం కోసమేనా?