కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడిచేయడంలో మాస్కులు ధరించడమే అత్యంత కీలకమని అంతర్జాతీయ శాస్త్రవేత్తలు, నిపుణులు సూచిస్తూనే ఉన్నారు. ఇలా చేయడం వల్ల కొవిడ్ మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించవచ్చని అమెరికా శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. పూర్తిస్థాయిలో మాస్కులు ధరించడం వల్ల వచ్చే ఆగస్టు నాటికే అమెరికాలో దాదాపు 14వేల మంది ప్రాణాలను కాపాడుకోవచ్చని తాజాగా జరిపిన అధ్యయనంలో అమెరికా శాస్త్రవేత్తలు అంచనా వేశారు.
వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా.. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ మాస్కు ధరించడమే ఎంతో మేలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ సమయంలో మాస్కు ధరించడం వల్ల ఎంతమంది ప్రాణాలు కాపాడుకోవచ్చనే అంశంపై అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్, ఎవాల్యుయేషన్(ఐహెచ్‌ఎంఈ) ఓ అంచనా వేసింది. దీని ప్రకారం, 2021 ఆగస్టు నాటికి అమెరికాలో కొవిడ్ మరణాలు 6,18,523కు చేరుకోవచ్చని లెక్కగట్టింది. ఒకవేళ అమెరికాలో 95శాతం జనాభా మాస్కు ధరిస్తే మాత్రం.. ఇందులో కనీసం 14వేల మంది ప్రాణాలను కాపాడుకోవచ్చని అంచనా వేసింది. తద్వారా కొవిడ్ మరణాల సంఖ్యను 6,04,413కు తగ్గించవచ్చని ఐహెచ్‌ఎంఈ పేర్కొంది.