అణు మహా శక్తులైన రష్యా, అమెరికాల సైన్యాల మధ్య ఇటీవల ఘర్షణ వాతావరణం పెరిగిపోయింది. వారం వ్యవధిలోనే ఈ రెండు దళాలు రెండు సార్లు ముఖాముఖి తలపడ్డాయి. ఈ రెండు సార్లు రష్యా దళాలు దూకుడుగా అమెరికాకు చెందిన వాహనాలు, విమానాలపైకి వెళ్లాయి. వీటిల్లో ఒకసారి నేరుగా రష్యా వాహనాలు అమెరికా సాయుధ వాహనానలను ఢీకొన్నాయి కూడా. ఓ పక్క అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఇవి చోటు చేసుకోవడం గమనార్హం.
అసలేం జరిగింది..
ఇటీవల అమెరికాకు చెందిన బీ-52 బాంబర్ విమానం ఐరోపాలోని నల్ల సముద్రం వద్ద అంతర్జాతీయ గగనతలంలో ప్రయాణిస్తోంది. అదే సమయంలో రష్యాకు చెందిన యుద్ధవిమానం ఒకటి హఠాత్తుగా అమెరికా విమానానికి 100 అడుగుల దూరంలోకి వచ్చింది. పలు మార్లు బీ52 ముక్కు భాగం పై నుంచి గాల్లోకి ఎగిరింది. ఒక దశలో అమెరికా విమాన పైలట్ కొంత ఇబ్బంది పడ్డాడు. ఈ విషయాన్ని ఐరోపాలోని అమెరికా వాయుసేన కమాండర్ జెఫ్ హార్రిగెయిన్ తెలిపారు. గగనతలంలో అనవసరంగా ప్రమాదం జరిగే పరిస్థితి తలెత్తిందని ఆయన అన్నారు. అంతర్జాతీయ విమాన నిబంధనలకు వ్యతిరేకమని అన్నారు. వాస్తవానికి అమెరికా బీ52 బాంబర్ విమానం శుక్రవారం నాటో సహచర దేశాల గగనతలాలపై ప్రయాణించి సంఘీభావం వ్యక్తం చేసే కార్యక్రమం నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకొంది.