తెలంగాణ

telangana

By

Published : Jul 27, 2020, 8:00 PM IST

ETV Bharat / international

30వేల మందితో అతిపెద్ద వ్యాక్సిన్ ప్రయోగం

కరోనా వ్యాక్సిన్​ చివరి దశ పరీక్షల్లో భాగంగా అతిపెద్ద క్లినికల్​ ట్రయల్స్​ను ప్రారంభిస్తోంది అగ్రరాజ్యం అమెరికా. 30వేల మంది వలంటీర్లపై వ్యాక్సిన్​ను ప్రయోగిస్తోంది. చైనా, బ్రిటన్​ ఇప్పటికే తుది దశ వ్యాక్సిన్​ ట్రయల్స్​ను మొదలుపెట్టాయి. వైరస్​ ప్రభావం అత్యంత తీవ్రంగా ఉన్న బ్రెజిల్​ సహా ఇతర దేశాల్లో కొద్ది మందిపై క్లీనికల్​ ట్రయల్స్ నిర్వహిస్తున్నాయి.

Virus vaccine put to final test in thousands of volunteers
30వేల మంది వాలంటీర్లతో అతిపెద్ద వ్యాక్సిన్ ప్రయోగం

కరోనా వ్యాక్సిన్​ చివరి దశ ప్రయోగాలను భారీ స్థాయిలో నిర్వహిస్తోంది అగ్రరాజ్యం అమెరికా. 30వేల మంది వలంటీర్లపై సోమవారం నుంచి క్లినికల్​ ట్రయల్స్ ప్రారంభిస్తోంది. అయితే ఈ వ్యాక్సిన్ వైరస్​ నుంచి పూర్తిగా రక్షణ కల్పిస్తుందని కచ్చితంగా చెప్పలేమని అమెరికా జాతీయ ఆరోగ్య సంస్థ తెలిపింది.

వ్యాక్సిన్​ ఊహించిన ఫలితాలను ఇస్తుందో లేదో ఆధారాలతో తెలుసుకునేందుకు వలంటీర్లకు డోసులు ఇస్తారు. రెండు డోసుల అనంతరం ఫలితాలను సమీక్షిస్తారు. వారి దినచర్యలను గమనించిన అనంతరం వ్యాక్సిన్​ డోసులు ఇచ్చిన వారిలో ఎవరు ఎక్కువ వైరస్​ బారిన పడుతున్నారో నిర్ధరిస్తారు.

చైనా, ఆక్స్​ఫర్డ్​ యూనివర్సీటీలు అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ల తుది దశ ప్రయోగాలను ఇప్పటికే ప్రారంభించారు. వైరస్​ ప్రభావం అధికంగా ఉన్న బ్రెజిల్ సహా ఇతర దేశాల్లో కొద్ది మందిపై ఈ క్లినికల్​ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు.

ఏ వ్యాక్సిన్​కైనా..

ఇతర దేశాలు తయారు చేసిన ఏ వ్యాక్సిన్​నైనా తాము వినియోగించాలంటే ముందుగా స్థానికంగా 30వేల మందిపై క్లినికల్​ ట్రయల్స్​ నిర్వహించాకే నిర్ణయం తీసుకుంటామని అమెరికా చెబుతోంది. ఎన్ని వ్యాక్సిన్​లకైనా ఇవే నిబంధనలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. దీని ద్వారా వ్యాక్సిన్​ తమకు ఏ మేర రక్షణ కల్పిస్తుందో తెలుస్తుందని పేర్కొంది.

వ్యాక్సిన్ ట్రయల్స్​లో పాల్గొనేందుకు అమెరికాలో దాదాపు లక్షా 50వేల మంది వలంటీర్లు ఆన్​లైన్​లో నమోదు చేసుకున్నారని వైరాలజిస్ట్​ డా.లారీ కోరే తెలిపారు.

ఆక్స్​ఫర్డ్ వ్యాక్సిన్​ తుదిదశ ప్రయోగాలను ఆగస్టులో భారీ స్థాయిలో ప్రారంభించనున్నారు. జాన్సన్ అండ్ జాన్సన్​ రూపొందించిన వ్యాక్సిన్​ను సెప్టెంబరులో, నోవా వ్యాక్సిన్​ క్లినికల్​ ట్రయల్స్​ను అక్టోబరులో మొదలుపట్టనున్నారు.

ఈ వ్యాక్సిన్లు అనుకున్న ఫలితాలిస్తే అందుబాటులోకి రావడానికి ఎంతలేదన్నా కొన్ని నెలలు పడుతుంది. అమెరికా సహా ఇతర సంపన్న దేశాలు ఇప్పటికే మిలియన్ల సంఖ్యలో డోసులు సిద్దం చేయాలని ఆర్డర్లు ఇచ్చాయి.

ఇదీ చూడండి: కొవిడ్‌ చికిత్సకు మరో 21 మందులు!

ABOUT THE AUTHOR

...view details