రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న అమెరికా మాజీ సైనికుడు ఫిలిప్ కాన్.. కరోనా మహమ్మారి సోకి మరణించాడు. ఐవో జిమా యుద్ధం, హిరోషిమా, నాగసాకిలపై అణుబాంబు వేసిన తర్వాత ఏరియల్ సర్వేలకు ఈయన సహకారం అందించాడు.
అయితే.. 1918-19 మధ్య కాలంలో విజృంభించిన స్పానిష్ ఫ్లూతో అతని కవల సోదరుడు శామ్యూల్ మరణించాడు. యాదృచ్ఛికమే అయినా వందేళ్ల వ్యవధిలో కవలలు రెండు వేర్వేరు మహమ్మారులతో ప్రాణాలు కోల్పోయారు.
ఫిలిప్, శామ్యూల్ 1919 డిసెంబర్లో జన్మించారు. అప్పటికే విజృంభించిన స్పానిష్ ఫ్లూతో వారిలో ఒకరైన శామ్యూల్ మరణించాడు. అయితే ఫిలిప్ తన జీవిత కాలంలో ఇలాంటి వైరస్ వస్తుందని భయపడినట్లు అతని మనవుడు వారెన్ జిస్మాన్ తెలిపాడు.
" నేను తాతగారితో తరచూ మాట్లాడుతూ ఉండేవాడిని. ఆ సమయంలో ఆయన చరిత్ర మళ్లీ పునరావృతం అవుతుందని చెప్పారు. వారు పుట్టిన ఏడాది వ్యాప్తి చెందిన వైరస్ మళ్లీ వందేళ్లకు వస్తుందన్నారు. ఈనెల 17న తాతగారు మరణించేందుకు ముందు దగ్గు వంటి కరోనా లక్షణాలతో బాధపడ్డారు. గత కొన్ని రోజులుగా తాతగారు వారి సోదరుడి గురించి ప్రస్తావించారు."