కరోనా కారణంగా ఇప్పటికే అనేక సమస్యలు ఎదుర్కొంటున్న అమెరికాలో కొత్తగా వైరస్ క్లస్టర్లు పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. సెమిస్టర్ పరీక్షల కోసం తెరిచిన యూనివర్సిటీలే వైరస్ వ్యాప్తికి కేంద్ర బిందువులుగా మారుతున్నాయి. ఉత్తర కరోలినాలోని హాస్టళ్లు, నోట్రీ డేమ్లోని వసతి గృహాలను కొత్తగా వైరస్ క్లస్టర్లుగా గుర్తించారు యూనివర్సిటీ అధికారులు.
వీకెండ్ పార్టీలు, నైట్ క్లబ్‌లలో విద్యార్థులు మాస్కులు ధరించకుండా, భౌతిక దూరం పాటించకుండా తిరుగుతుండటం వల్ల ఆఫ్ క్యాంపస్‌లలోనూ వైరస్ క్లస్టర్లు పెరిగిపోతున్నాయి. ఓక్లహామాలో జరిగిన ఓ పార్టీకి సంబంధించిన వీడియోలో విద్యార్థులు మాస్కులు లేకుండా భారీ సంఖ్యలో గుమిగూడిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. అక్కడ 23 కేసులు నమోదయ్యాయి. ఆ ప్రాంతంలో ఉన్న విద్యార్థులను ఐసోలేషన్‌లో ఉంచారు యూనివర్సిటీ అధికారులు.
ఇలా అయితే కష్టమే..
ఇలా జరుగుతుండటం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు ఓ న్యూజెర్సీ విద్యార్థి. యూనివర్సిటీలో ఉదయం నుంచి అధ్యాపకులతో మాట్లాడటం, తరగతి గదిలో చాలా మందితో కలిసి కూర్చోవాల్సి వస్తోందని తెలిపాడు. దీని వల్ల కరోనాపై పోరాటం కొనసాగించలేమనే అభిప్రాయం వ్యక్తపరిచాడు.