అమెరికాలో పోలీసుల కర్కశత్వానికి బలైన నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ ఉదంతం మరువక ముందే.. మరో దారుణం వెలుగుచూసింది. లూసియానాలో ఓ ఆఫ్రో అమెరికన్ను పోలీసులు అమానుషంగా కొట్టి అరెస్టు చేశారు. చివరకు బాధితుడు తీవ్రగాయాలతో పోలీసు కస్టడీలోనే మరణించాడు. ఇప్పుడు ఈ వీడియో అమెరికాలో సంచలనం రేపుతోంది.
"ఉత్తర లూసియానా నగరంలోని ష్రెవ్ఫోర్టులో 44 ఏళ్ల నల్లజాతీయుడు టామీ డేల్ మెక్గ్లోథెన్కు, పోలీసు అధికారులకు మధ్య వాగ్వాదం జరిగింది. తర్వాత చెలరేగిన పరిణామాల్లో టామీ తీవ్రంగా గాయపడ్డాడు. చివరికి స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఏప్రిల్ 6న మరణించాడు."
- టాడ్ థోమా, వైద్యుడు
ఓ ప్రత్యక్ష సాక్షి తీసిన నాలుగున్నర నిమిషాల నిడివిగల వీడియోలో.. నలుగురు పోలీసులు బాధితుడిని తీవ్రంగా కొట్టారు. ఒకరు నల్లజాతి వ్యక్తి అయిన టామీ డేల్పై పిడిగుద్దులు కురిపిస్తుంటే, మరొకరు లాఠీతో కొడుతూనే ఉన్నారు. బాధితుడిపై టేజర్ వాడినట్లు ఆడియో కూడా వినిపించింది. మరోవైపు టామీ కూడా పోలీసు అధికారులపై ఎదురుతిరిగినట్లు కనిపిస్తోంది. అనంతరం టామీ చేతులకు బేడీలు వేసి నేలపై పడేశారు పోలీసులు. తర్వాత అతనిని కొట్టుకుంటూ పోలీసు వాహనంలో స్టేషన్కు తరలించారు.
బతికేవాడే.. కానీ
టాడ్ థోమా ప్రకారం.. 'ఏప్రిల్ 5న నల్లజాతీయుడు టామీ డేల్.. తన ఇంటి యజమానితో గొడవపడ్డాడు. ఇంటి యజమానిని మానసికంగా హింసించి, ఇబ్బందిపడేలా చేశాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు టామీని నిలువరించడానికి ప్రయత్నించారు. అయితే టామీ పోలీసులపై తిరగబడ్డాడు. దీనితో పోలీసులు టేజర్ ప్రయోగించారు. దీనితో అతను ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందిపడి, చలనం లేకుండా పడిపోయినట్లు తెలుస్తోంది. అయితే పోలీసులు తమ వాహనం వెనుకభాగంలో టామీని 48 నిమిషాల పాటు ఉంచారు. చివరికి తీవ్రంగా గాయపడిన అతను మరణించాడు. టామీకి మతిమరుపు సమస్యతో పాటు గుండె జబ్బు కూడా ఉంది. ఇవి కూడా అతని మరణానికి కారణమయ్యాయి.'
ఇదీ చూడండి:'కరోనా సంక్షోభంతో 5 కోట్ల మంది కడు పేదరికంలోకి!'