తెలంగాణ

telangana

ETV Bharat / international

కమలతో ప్రమాణ స్వీకారం చేయించనున్న సోనియా

అమెరికా తదుపరి ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ బుధవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి సోనియా సోటోమేయర్​ ఆమెతో ప్రమాణస్వీకారం చేయిస్తారు. మరోవైపు కమల సోమవారం తన సెనేట్ పదవికి రాజీనామా చేయనున్నారు.

Vice President-elect Harris to resign her Senate seat on Monday
సోనియా సోటోమేయర్​-కమలా హారిస్..

By

Published : Jan 18, 2021, 6:31 AM IST

అమెరికా తదుపరి ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ బుధవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. అమెరికాకు కాబోయే మొట్టమొదటి మహిళా ఉపాధ్యక్షురాలిగా మాత్రమే కాక.. దక్షిణాసియా మూలాలున్న నల్లజాతీయురాలైన తొలి వ్యక్తిగా ఆమె చరిత్ర సృష్టించనున్నారు.

రెండు బైబిల్‌ పుస్తకాలపై..

ప్రమాణ స్వీకారం సందర్భంగా కమలా హారిస్‌ రెండు బైబిల్‌ పుస్తకాలను పట్టుకోనున్నారు. తల్లి శ్యామలా గోపాలన్‌ తరువాత తల్లిగా భావించే రెగీనా షెల్టాన్‌ ఉపయోగించిన బైబిల్‌ను తీసుకురానున్నారు. చిన్నతనంలో కమల నివాసానికి రెండిళ్ల దూరంలో రెగీనా ఉండేవారు. పాఠశాల నుంచి వచ్చిన తరువాత కమల నేరుగా అక్కడికే వెళ్లేవారు. ఆమెను కూడా తల్లిగానే గౌరవించేవారు. ఈ బైబిల్‌ను పట్టుకొనే అటార్నీగా, సెనేటర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. బాల్యంలోనే హీరోగా భావించిన పౌర హక్కుల నాయకుడు థుర్‌గుడ్‌ మార్షల్‌ చదివిన బైబిల్‌ను కూడా పట్టుకోనున్నారు. ఆయన అనంతరం సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయ్యారు. ఈ పదవి చేపట్టిన తొలి నల్లజాతీయునిగా గుర్తింపు పొందారు. ఆయన స్ఫూర్తితోనే కమల న్యాయశాస్త్రాన్ని అభ్యసించారు.

కమలచే ప్రమాణ స్వీకారం చేయించనున్న సోనియా

అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలా హారీస్‌చే సుప్రీంకోర్టు మహిళా న్యాయమూర్తి జస్టిస్‌ సోనియా సోటోమేయర్‌ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. సుప్రీంకోర్టులో మహిళా న్యాయమూర్తులుగా వ్యవహరించిన వారిలో సోనియా మూడోవారు కావడం గమనార్హం. ఆమె హిస్పానిక్‌ (దక్షిణ అమెరికా ఖండం) జాతికి చెందిన తొలి మహిళ కావడం ఇంకో విశేషం.

నేడు సెనేటర్‌ పదవికి రాజీనామా

ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టనుండడంతో కాలిఫోర్నియా సెనేటర్‌ పదవికి కమల సోమవారం రాజీనామా చేయనున్నారు. మిగిలిన రెండేళ్ల కాలానికి ఆమె స్థానంలో ఆ రాష్ట్ర సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ అలెక్స్‌ పడిల్లాను గవర్నర్‌ నియమించనున్నారు.

ఇదీ చదవండి:కమల వండితే.. అమెరికా ఆహా అంది!

ABOUT THE AUTHOR

...view details