కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న విషయం తెలిసిందే. నవంబర్ కన్నా ముందే ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని మరోమారు ఉద్ఘాటించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. వచ్చే మూడు, నాలుగు వారాల్లోనే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేశారు.
ప్రపంచవ్యాప్తంగా పలు కంపెనీలు అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌లు తుది దశ ప్రయోగాలకు చేరుకున్నాయి. వీటిలో కొన్నింటిని అత్యవసర వినియోగానికి రష్యా, చైనా వంటి దేశాలు అనుమతులు కూడా ఇచ్చాయి. ఇక ఈ వ్యాక్సిన్‌లు మరికొద్ది నెలల్లోనే ప్రజావినియోగానికి అందుబాటులోకి వస్తాయని అంతర్జాతీయంగా పలు ప్రకటనలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘కరోనా వ్యాక్సిన్ పొందేందుకు చాలా దగ్గరకు చేరుకున్నామని వెల్లడించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.
"కరోనా వ్యాక్సిన్ పొందేందుకు చాలా దగ్గరకు చేరుకున్నాం. రానున్న కొన్ని వారాల్లోనే అది అందుబాటులోకి రానుంది. అది మూడు, నాలుగు వారాల్లోపే రావచ్చు. ప్రభుత్వంలో వేరేవారు ఉంటే, వ్యాక్సిన్ రావడానికి మరిన్ని సంవత్సరాలు పట్టేది. కానీ, ఎఫ్‌డీఏతో పాటు మరిన్ని అనుమతులతో వేగంగా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెస్తున్నాం."
- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు