ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన అంటువ్యాధుల్లో 1918-19 మధ్య వచ్చిన ఇన్‌ఫ్లూయంజా అత్యంత ప్రమాదకరమైనది. ఈ ఫ్లూ జ్వరం వల్ల అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల మంది చనిపోయారు. ఒక్క అమెరికాలోనే 6.75 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇన్‌ఫ్లూయంజా నివారణకు స్థానిక ప్రభుత్వాలు ఎన్నో చర్యల్ని చేపట్టాయి. పాఠశాలల్ని, రద్దీ ప్రదేశాల్ని మూసివేశారు. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయకూడని ఆదేశాలిచ్చారు. జేబు రుమాళ్లు, టిష్యూ కాగితాల్ని వాడేలా ప్రజల్ని ప్రోత్సహించారు. వీటన్నింటికంటే ఎంతో ప్రభావం చూపిన మరో ముఖ్యమైన అంశం ఉంది. అదే మాస్కు ధారణ. అంటువ్యాధి వ్యాపించకుండా ప్రజలందరూ మాస్కులు పెట్టుకోవాలని అమెరికాలో ప్రత్యేక ఉత్తర్వులు వెలువడ్డాయి.
ఓ పక్క ప్రపంచయుద్ధం జరుగుతున్న రోజులవి. మరోపక్క ఇన్‌ఫ్లూయంజా పంజా. మహమ్మారి నుంచి ప్రజలతో పాటు, సైనికుల్నీ కాపాడుకోవాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో జాగ్రత్తలు పాటించే అమెరికన్‌లంతా దేశభక్తులనే ప్రచారం మొదలైంది. ఇది మంచి ఫలితాన్నే ఇచ్చింది. జనమంతా మాస్కులు ధరించడం మొదలు పెట్టారు. అప్పట్లో గాజు వస్త్రంతో మాస్కుల్ని రూపొందించారు. రెడ్‌క్రాస్ వాలంటీర్లు పెద్ద సంఖ్యలో మాస్కుల్ని తయారుచేసి ప్రజలకు అందించారు. సొంతంగా చేసుకోవాలనుకునే వారికి వార్తాపత్రికలు సూచనలు ఇచ్చేవి.