తెలంగాణ

telangana

ETV Bharat / international

రూ.75లక్షల కోట్ల నాణెం ముద్రించేందుకు అడుగులు

అమెరికా రుణ నియంత్రణ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనా నాణెన్ని ముద్రించాలని యోచిస్తోంది. దీని విలువ ఒక ట్రిలియన్​ డాలర్లు (రూ.75 లక్షల కోట్లు). ఈ కాయిన్ ముద్రించే దిశగా బైడెన్​ సర్కారు అడుగులు వేస్తున్నట్లు సమాచారం.

1 trillion dollar platinum coin
ప్రపంచంలోనే అత్యంత విలువైన నాణెం

By

Published : Oct 8, 2021, 7:14 AM IST

అమెరికా ప్రపంచంలోనే అత్యంత విలువైన నాణెన్ని ముద్రించనుంది. దీని విలువ ఒక ట్రిలియన్‌ డాలర్లు(trillion dollar platinum coin).. అంటే దాదాపు రూ.75లక్షల కోట్లు. అమెరికా రుణ నియంత్రణ సంక్షోభాన్ని ఈ కాయిన్‌తో ఎదుర్కోవాలని భావిస్తోంది. దీనిని ముద్రించేందుకు బైడెన్‌ సర్కార్‌ వడివడిగా అడుగులు వేస్తోంది. కానీ, ఆర్థిక రంగ నిపుణులు మాత్రం అమెరికా కరెన్సీ విలువ దెబ్బతింటుందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

డెట్‌ సీలింగ్‌ ఏమిటీ..?

అమెరికా ట్రెజరీ బాండ్లను ఎంతవరకు సంపాదించాలి అనే దానిపై నిబంధనే డెట్‌సీలింగ్‌ అంటారు. ఈ సొమ్మును వివిధ ఆర్థిక కార్యకలాపాలకు వినియోగిస్తారు. దీనికి కాంగ్రెస్‌ అనుమతి ఉండాలి. లేకపోతే ప్రభుత్వాలకు వచ్చే ఆదాయం కంటే వెచ్చించే మొత్తం ఎక్కువైపోతుంది. 1917లో తొలిసారి దీనిని అమెరికా ప్రవేశపెట్టింది. కానీ, 1960 తర్వాత నుంచి డెట్‌సీలింగ్‌ను 78 సార్లు పెంచారు. ప్రస్తుతం 22 ట్రిలియన్‌ డాలర్లుగా ఉన్న ఈ మొత్తాన్ని 28.5 మిలియన్‌ డాలర్లకు పెంచవచ్చనే అంచనాలు ఉన్నాయి.

ప్లాటినం కాయిన్‌ ఎందుకు..?

ఈ సారి అక్టోబర్‌ 18 నాటికి ఆమోదించాల్సిన బడ్జెట్‌లో అమెరికాకు దాదాపు 2 ట్రిలియన్‌ డాలర్ల సొమ్ము తగ్గింది. ఇందుకోసం ట్రిలియన్‌ డాలర్లు విలువైన ఓ ప్లాటినం కాయిన్‌ను(trillion dollar platinum coin) ముద్రించమని బైడెన్‌ సర్కారు కోరవచ్చు.

2011లో చేసిన ఓచట్టం అధ్యక్షుడికి ఆ అధికారం ఇచ్చింది. దీని ప్రకారం బంగారం, వెండి, నికెల్‌,రాగి,కంచు కాకుండా ప్లాటినంతో చేసిన నాణెనికి ఎంత విలువ అయినా ప్రభుత్వం ఇవ్వవచ్చు. ఈ నేపథ్యంలో బైడెన్‌ సర్కారు మింట్‌లో ట్రిలియన్‌ డాలర్ల విలువైన కాయిన్‌ను ముద్రించే అవకాశం ఉంది.. దానిని ఖజానాలో పెట్టి అమెరికా ప్రభుత్వం మరో ట్రిలియన్‌ డాలర్లు తీసుకొనే అవకాశం ఉంది.

గతంలో ఎవరైనా చేశారా..?

గతంలో ఒబమా సర్కారు అధికారంలో ఉన్నప్పుడు 2011లో ఈ విధంగా ప్లాటినం కాయిన్‌ తయారు చేయాలని భావించారు. ఈ విషయాన్ని ఒబామానే 'పాడ్‌ సేవ్‌ అమెరికా' అనే పాడ్‌ కాస్ట్‌లో వెల్లడించారు. కాకపోతే ఇది ఒక రాతియుగపు ఆలోచన అని ఆయన అభివర్ణించారు.

అమెరికా ట్రెజరీ సెక్రటరీ జానెట్‌ అలెన్‌(US treasury secretary) మాట్లాడుతూ బైడెన్‌ ట్రిలియన్‌ డాలర్ల ఆలోచనను తాను వ్యతిరేకిస్తున్నట్లు వెల్లడించారు. దీనిని సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఈ రకమైన పనులు చేసి.. అప్పులను అమెరికా ఎలా చెల్లిస్తుందో ప్రపంచానికి చూపించడం అవసరమా..? అని అలెన్‌ వ్యాఖ్యనించారు. అంతేకాదు అమెరికన్‌ ఫెడ్‌ రిజర్వుపై ప్రపంచానికి ఉన్న నమ్మకాన్ని ఈ ట్రిలియన్‌ డాలర్ల కాయిన్‌ దెబ్బతీస్తుందన్నారు. అడ్డగోలుగా డబ్బులను అప్పు రూపంలో ఆర్థిక వ్యవస్థలోకి చొప్పిస్తే.. ఇప్పటికే ఉన్న డబ్బు విలువ కూడా పడిపోతుందనే భయాలు ఉన్నాయి. మరి బైడెన్‌ సర్కారు అలెన్‌ మాట ఏ మేరకు వింటుందో చూడాలి.

ఇదీ చూడండి:వెనక్కి తగ్గిన బ్రిటన్​.. భారత్​ ప్రయాణికులపై ఆంక్షల సడలింపు

ABOUT THE AUTHOR

...view details