Joe biden news: ఉక్రెయిన్‌పై దండయాత్ర చేస్తున్న రష్యా.. నాటో సభ్య దేశాలవైపు దూసుకొస్తే అమెరికా రంగంలోకి దిగుతుందని హెచ్చరించారు ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్. పుతిన్‌ను ఇప్పుడు ఆపకపోతే మరింత రెచ్చిపోతాడని పేర్కొన్నారు. రష్యాపై ఆంక్షలు విధించిన అనంతరం ఈమేరకు శ్వేతసౌధంలో గురువారం మీడియాతో మాట్లాడారు.
"ఒకవేళ పుతిన్.. నాటో సభ్య దేశాల వైపు వెళ్తే మేం జోక్యం చేసుకుంటాం. నేను ఒప్పకునే ఏకైక విషయం ఏమిటంటే.. పుతిన్‌ను ఇప్పుడు ఆపకపోతే అతని ధైర్యం మరింత పెరుగుతుంది. అతనికి వ్యతిరేకంగా చర్యలు చేపట్టకపోతే మరింత రెచ్చిపోతాడు. అందుకే రష్యాపై అత్యంత కఠిన ఆంక్షలు విధిస్తున్నాం. తూర్పు ఐరోపా దేశాలకు అవసరమైన బలగాలను సమకూర్చడం ద్వారా ఇది పెద్ద ఘర్షణకు దారీతీయదని మేము భావిస్తున్నాం. నాటో దేశాలు గతంలో ఎన్నడులేనంత ఐక్యంగా ఉన్నాయి. పుతిన్‌తో మాట్లాడే ఆలోచన నాకు లేదు. ఆయన సోవియట్ యూనియన్ను తిరిగి స్థాపించాలనుకుంటున్నారు. అందుకే ఇలాంటి చర్యలకు దిగుతున్నారు. ప్రపంచంలోని ప్రస్తుత పరిస్థితులకు అతని ఆలోచనలు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి."
-జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు.