జమ్ముకశ్మీర్‌లో ఆర్థిక, రాజకీయ పరిస్థితులను సాధారణ స్థితికి తీసుకురావడానికి భారత్ తీసుకున్న చర్యలను స్వాగతిస్తున్నట్లు అమెరికా పేర్కొంది. ఈ చర్యలు భారత ప్రజాస్వామ్య విలువలకు అనుగుణంగా ఉన్నాయని కొనియాడింది. కశ్మీర్‌కు సంబంధించి అమెరికా విధానంలో ఎలాంటి మార్పు రాదన్న ఆ దేశ విదేశాంగ ప్రతినిధి నెడ్ ప్రైస్.. కేంద్రపాలిత ప్రాంతంలో పరిణామాలను నిశితంగా గమనిస్తున్నట్లు తెలిపారు.
భారత్‌తో పాటు పాకిస్థాన్‌తో అమెరికాకు కీలక సంబంధాలు ఉన్నాయన్నారు ప్రైస్. "ఇరు దేశాలతోనూ నిర్మాణాత్మక సంబంధాలున్నాయి. భారత్ వ్యూహాత్మక భాగస్వామి. పాక్ ప్రాంతంలో కీలక ప్రయోజనాలు ఉన్నాయి. వీటి కోసం పాక్ అధికారులతో కలిసి పని చేయాలని భావిస్తున్నాం" అని ప్రైస్ అన్నారు. కశ్మీర్ సహా ఇతర సమస్యలపై భారత్-పాకిస్థాన్‌ల మధ్య చర్చలకు అమెరికా మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు.