సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత-చైనా చేస్తున్న ప్రయత్నాలను అమెరికా స్వాగతించింది. శాంతి నెలకొల్పేందుకు ఇరు దేశాలు చేస్తున్న కృషిని.. బలగాల ఉపసంహరణను నిశితంగా గమనిస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది.
తూర్పు లద్దాఖ్‌లోని పాంగాంగ్ సరస్సు ప్రాంతాల్లో ఇరు దేశాల సైనిక బలగాల ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభమైందని.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ రాజ్యసభలో ప్రకటించిన నేపథ్యంలో అమెరికా స్పందించింది. పరిస్థితి సాధారణ స్థితికి వచ్చేంత వరకు నిశితంగా పర్యవేక్షిస్తూనే ఉంటామని తెలిపింది.
బలగాల ఉపసంహరణను రిపబ్లికన్ సభ్యుడు మైఖేల్ మక్కాల్ కూడా స్వాగతించారు. భారత్ తన సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి బలంగా నిలబడటం హర్షణీయమని ఆయన ట్వీట్ చేశారు. చైనా కమ్యూనిస్ట్ పార్టీ తూర్పు, దక్షిణ చైనా సముద్రం నుంచి హిమాలయాల వరకు నిరంతర చేస్తోన్న విస్తరణవాదానికి 21వ శతాబ్దంలో చోటు లేదన్నారు.
గత ఏడాది జూన్ 15న గాల్వన్ లోయలో భారత్-చైనా బలగాల మధ్య ఘర్షణ తలెత్తి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కీలక ఫింగర్ ప్రాంతాల్లో ఇరు దేశాలు భారీగా బలగాలను మోహరించాయి. పలు దఫాలుగా సైనిక, దౌత్య స్థాయి చర్చలు జరిగాయి. ఇటీవలి చర్చల్లో బలగాల ఉపసంహరణకు ఏకాభిప్రాయం కుదిరినట్లు రక్షణ మంత్రి ప్రకటించారు. బలగాలను చైనా వెనక్కి మళ్లిస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి:'యథాతథ స్థితి నెలకొల్పడమే లక్ష్యం'