కరోనా ప్రభావం అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ కుటుంబంపైనా పడింది. దిల్లీలో నివాసముండే ఆమె మామ జీ బాలచంద్రన్ ఇటీవలే 80వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఏటా కుటుంబ సభ్యుల కోలాహలం మధ్య ఘనంగా పుట్టినరోజు వేడుక చేసుకునే ఆయన.. దేశంలో కరోనా పరిస్థితి దృష్ట్యా ఈసారి అలా జరుపుకోలేక పోయారు. అయితే కమలా హారిస్ సహా బంధుమిత్రులంతా తనకు ఫోన్ చేసి బర్త్డే విషెస్ చెప్పారని ఓ ఇంటర్వ్యూలో బాలచంద్రన్ వెల్లడించారు.
కమలా హారిస్, ఆమె భర్త డౌగ్ ఎమ్హోఫ్తో ఫోన్లో చాలాసేపు సంభాషించినట్లు బాలచంద్రన్ వివరించారు. అమెరికాలో ఉన్న తన కూతురు బాగోగులను చూసుకుంటానని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని కమల భరోసా ఇచ్చినట్లు చెప్పారు. మార్చి తర్వాత మళ్లీ ఆమెతో మాట్లాడలేదని పేర్కొన్నారు. ఆ తర్వాత నుంచి భారత్లో కరోనా ఉగ్రరూపం దాల్చి వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్న విషయాన్ని గుర్తుచేశారు.
బాలచంద్రన్ పదవీ విరమణ అనంతరం దిల్లీలోని తన నివాసంలోనే ఉంటున్నారు. నిత్యావసరాలు తెచ్చుకోవడానికి మాత్రమే అప్పడప్పుడూ బయటకు వెళ్తారు. అయితే తాను అదృష్టవంతుడినని చెబుతున్నారు. తనను కలిసే వారు ఎవరూ లేనందున స్వయంకృపరాధంతో తప్పితే ఇతరుల వల్ల కరోనా సోకే అవకాశం తనకు లేదని పేర్కొన్నారు. తన సోదరి సరళ కూడా చెన్నైలోని అపార్ట్మెంట్లో ఐసోలేషన్లోనే ఉంటున్నారని వివరించారు. ఇద్దరూ కరోనా టీకా తీసుకున్నట్లు వెల్లడించారు.